సుబ్బులు మరియు వెంకయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. సుబ్బులు మంచివాడు పైగా చాలా తెలివైనవాడు. వెంకయ్య మందబుద్ధుడు మరియు చెడుస్వభావం కలిగినవాడు. ఇద్దరు స్నేహితులు కావడంతో ఏ పని చేసిన కలిసి చేసేవారు. ప్రతి పనిలో తెలివితో కూడిన సుబ్బులు పనిని మరియు అతని సంపాదనను చూసి అసూయపడేవాడు వెంకయ్య. ఎంత పని చేసినను తన మందబుద్ధితో, చెడు స్వభావంతో అనుకున్న ఫలితం దొరక్కపోయేది వెంకయ్యకి.
ఒకరోజు వెంకయ్య ” ఇలా అయితే ఆ సుబ్బులు తన తెలివి తేటలతో బాగా ధనవంతుడు అయిపోతాడు, నేను ఇలాగె పేదవాడిలా ఉండిపోవాల్సి వస్తుంది.” ఎలాగైనా సుబ్బులుని మోసం చేసి తన తెలివితో నేను డబ్బులు సంపాదించుకోవాలి అని నిర్ణయించుకున్నాడు.
ఆ మరునాడే వెంకయ్య , సుబ్బులు ఇంటికి వెళ్లాడు. సుబ్బులు ఈ గ్రామంలో ఉండి మనం ఎంత కష్టపడినా చాలా తక్కువగా డబ్బు సంపాదిస్తున్నాము. ఇలా అయితే రేపటి రోజు మన భవిష్యత్తు పిల్లలు, కుటుంబం సంతోషంగా జీవించలేరు. కావున, మనం వేరే ప్రాంతానికి కొన్ని రోజులు వలస వెళ్లి బాగా డబ్బులు సంపాదించుకుని తిరిగి వద్దాము అని చెప్పాడు. దానికి సుబ్బులు మొదట్లో ఒప్పుకోకపోయినా తన స్నేహితుడి బలవంతంతో ఒప్పుకోవాల్సి వచ్చింది.
ఒక మంచి రోజు చూసుకుని ఇద్దరు వేరే దూర ప్రాంతానికి ప్రయాణమయ్యారు. సుబ్బులు తన తెలివితో చిన్న చిన్న పనులు చేస్తూ డబ్బు సంపాదించడం మొదలుపెట్టాడు. వెంకయ్యకి ఏమి చేయాలో అర్ధం కాక…! సుబ్బులుతో ” మనమేం చేసిన కలిసి చేద్దాం మరియు వచ్చిన డబ్బులు సమానంగా పంచుకుందాం ” అని అన్నాడు.. అందుకు సుబ్బులు ఒప్పుకున్నాడు.
ఆనాటి నుండి 5సంవత్సరాలు సుబ్బులు చాలా కష్టపడి పని చేస్తూ చాలా డబ్బులు సంపాదించాడు. వెంకయ్య సుబ్బులు చేతి కిందే ఉంటూ అన్ని లెక్కలు చూసుకుంటున్నాడు. వారి అవసరానికి మించిన డబ్బు వారి సొంతమైంది. మూడు తరాలు కూర్చొని తిన్న తరగనంత డబ్బు వారి దగ్గర పోగయ్యింది.
వెంటనే వెంకయ్య, సుబ్బులుతో … ఇప్పటికే చాలా రోజులయ్యింది ఇంటికి దూరంగా ఉండి.., ఇక వెళ్లిపోదాము మనకి కావలసిన డబ్బు కూడా ఉంది కదా..! అన్నాడు. ఆ మాట విన్న సుబ్బులు సరే అన్నాడు.
ఇద్దరు కలిసి వారి గ్రామానికి ప్రయాణమయ్యారు. వారు ఇంటికి కొద్ది దూరంలో ఉండగా … వెంకయ్య , సుబ్బులుతో మన దగ్గర ఇంత డబ్బు ఉండడం మంచిది కాదు అన్నాడు. సుబ్బుఇకి ఏమీ అర్ధం కాక ఎందుకు..? అని అడిగాడు. వెంకయ్య అవును ఇవుడు మనం ఇంత డబ్బుతో మన గ్రామానికి వెళ్తే మన ఇరుగు పొరుగు వారంతా డబ్బు సహాయం కావాలని మన దగ్గరికి వస్తారు. ఇక బంధువులు అయితే మన దగ్గరే ఉండిపోయిన ఆశ్చర్యపోనవసరం లేదు మరియు దారి మధ్యలో ఎవరైనా దొంగలు వస్తే మనం సంపాదించిన మొత్తం పోగొట్టుకోవాల్సిందే అని చెప్పాడు.
అది విన్న సుబ్బులు మరి ఏంచేద్దాం..? అని అడిగాడు. వెంటనే వెంకయ్య , మనకి ప్రస్తుతం కావలసినంత డబ్బు తీస్కొని మిగతాది మన గ్రామానికి దగ్గర్లోనే ఎదో ఒక చెట్టు దగ్గర దాచిపెడదాం. మళ్లి అవసరం వచ్చినపుడు ఇద్దరం కలిసి వచ్చి తీస్కోవచ్చు అని చెప్పాడు. అది విని సుబ్బులు, నీ ఆలోచన బాగానే ఉంది సరే అలాగే చేద్దాం అని ఒక మర్రి చెట్టు కింద మొదలు దగ్గర తవ్వి అందులో పాతిపెట్టారు. ఇక ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు.
“ఒకరోజు .. సుబ్బులుకి తెలియకుండా వెంకయ్య ఒక్కడే మర్రి చెట్టు దగ్గరికి వెళ్లి డబ్బు మొత్తం తీసుకున్నాడు”.
కొన్ని రోజులయ్యాక.. వెంకయ్య, సుబ్బులు దగ్గరికి వెళ్లి సుబ్బులుతో నా కుటుంబం చాలా పెద్దది కావున నేను తీసుకున్న డబ్బు మొత్తం అయిపోయింది. కావున, మనం మర్రిచెట్టు దగ్గరికి వెళ్లి డబ్బులు తీసుకుందాం అని అన్నాడు. సరే అని ఇద్దరు డబ్బు తీసుకోవడానికి చెట్టు దగ్గరికి వెళ్లారు.
వెంకయ్య డబ్బు పాతిపెట్టిన దగ్గర తవ్వి చూసాడు, అక్కడ డబ్బు లేదు. వెంటనే సుబ్బులుని కోపంగా చూస్తూ.. నేను లేనపుడు నువ్వే వచ్చి డబ్బు మొత్తం తీసుకున్నావు అని గొడవ పడ్డాడు. అపుడు సుబ్బులు దయనీయమైన మొహంతో ఇంతవరకు నేను ఇక్కడికి రాలేను, నేను అసలు డబ్బు తీసుకోలేను అని చెప్పాడు.
వెంటనే వెంకయ్య, మనం ఊరి పెద్ద దగ్గరికి వెళ్లి న్యాయం చెప్పించుకుందాం అని ఇద్దరు వెళ్లారు. ఊరి పెద్ద ఇద్దరిని అగ్ని దేవుడి పైన ప్రమాణం చేయమని చెప్పారు. అపుడు వెంకయ్య అగ్ని దేవుడి పైన ప్రమాణం చేసేముందు రేపటిరోజు ఆ మర్రిచెట్టు దగ్గరికి వెళ్లి ఆ చెట్టునే వేడుకుందాం నిజం చెప్పమని అడుగుదాం అన్నాడు.
వెంకయ్య ఆరోజు సాయంత్రం తన తండ్రి దగ్గరికి వెళ్లి, మనం పెద్ద సమస్యలో ఉన్నాం. నేను దొంగిలించిన డబ్బు మన చేయి జారేలా ఉంది. నేనొక ఉపాయం చెప్తాను నాన్న నువ్వు అలాగే చెయ్యు అన్నాడు. నాన్న మీరు ఉదయమే వెళ్లి మర్రిచెట్టు తొర్రలో దాక్కొని ఉండండి మేము వచ్చి డబ్బు దొంగిలించింది ఎవరు..? అని అడిగితే సుబ్బయ్య పేరు చెప్పండి అన్నాడు.
ఉదయమే ఊరు మొత్తం మర్రిచెట్టు దగ్గరికి వెళ్లి డబ్బు దొంగిలించింది ఎవరు..? అని అడిగితే మర్రిచెట్టు తొర్రలో నుండి సుబ్బులునే డబ్బు దొంగిలించాడు అని శబ్దం వినబడింది అది విని ఊరంతా ఆశ్చర్యపోయారు.
సుబ్బులు తాను చేయని దొంగతనం తన మీదకి వస్తుందని మరియు చెట్టు తొర్రలో నుండి శబ్దం రావడం అనుమానం కలిగింది. వెంటనే ఊరి పెద్ద దగ్గరికి వెళ్లి నాకు ఒక్క 5నిమిషాలు సమయం ఇవ్వండి నేనెంతో నిరూపించుకుంటాను అన్నాడు.
సుబ్బులు చెట్టు మొదలు దగ్గర నిప్పు అంటించాడు సుబ్బులు చేసేది ఏమి అర్ధంకాక ఊరి ప్రజలకి అలా చూస్తూ ఉన్నారు. ఆ నిప్పు కాస్త చెట్టు మొత్తానికి అంటుకోగానే చెట్టు తొర్రలో దాగిఉన్న వెంకయ్య తండ్రి ఊపిరి అందక వెంటనే బయటకి వచ్చేసాడు. అది చూసిన ఊరి ప్రజలు ఆశ్చర్యపోయారు. అంటే డబ్బు దొంగిలించింది వెంకయ్యే. నాటకమాడి ఆ నిందను సుబ్బులు పైన వేయాలనుకున్నాడు. సుబ్బులు తన తెలివితో తానేంటో నిరూపించుకున్నాడు అని ఊరి ప్రజలంతా మెచ్చుకున్నారు. వెంకయ్య దొంగిలించిన డబ్బు మొత్తం సుబ్బులుకి ఇచ్చేసి వెంకయ్య మరియు తన తండ్రికి శిక్ష విధించారు.