ఒక ఊరిలో విజయ్ అనే పిల్లవాడు ఉండేవాడు. వారి తల్లితండ్రులు హఠాత్తుగా చనిపోవడంతో విజయ్ ఎవరులేని అనాథ అయ్యాడు. విజయ్ తల్లి యొక్క దూరపు బంధువైన సరస్వతికి భర్త లేకపోవడం మరియు పిల్లలు కూడా లేని కారణంగా విజయ్ ని అక్కున చేర్చుకుంది. ఎంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసింది.
విజయ్ కూడా బాగా చదువుకుని పట్నంలో మంచి ఉద్యోగం సంపాదించాడు. విజయ్ కి సరస్వతి అంటే ఎనలేని ప్రేమ. తన వల్లే ఇలాంటి పరిస్థితిలో ఉన్నానని, లేకుంటే తన పరిస్థితి మరోలా ఉండేదని ఎపుడు అనుకుంటుండేవాడు. తను ఏమి చెప్పిన తూచా తప్పకుండ వినేవాడు, చేసేవాడు.
విజయ్ యుక్త వయసుకి వచ్చాక, పెళ్లి చేసుకోమని చెప్పింది సరస్వతి. అపుడు విజయ్, దానికి ఇంకా సమయం ఉందమ్మా…! నాకు నచ్చిన పట్నం పిల్ల దొరికితే చేస్కుంటా, లేకుంటే లేదు. అని చెప్పి ఉద్యోగ నిమిత్తం పట్నానికి వెళ్ళిపోయాడు.
సరస్వతి ఇంట్లో ఒక్కర్తే ఉండటం వలన, తన బాగోగులు వరసకి కోడలు అయిన నయన చూసుకునేది. నయన మంచితనం మరియు చురుకుతనం చూసిన సరస్వతికి, విజయ్ ఇచ్చి పెళ్లి చేయాలని , అలా చేస్తే విజయ్ ని బాగా చూసుకునే అమ్మాయినిచ్చి చేసినందుకు నాకు భారం కూడా తగ్గుతుంది మరియు నేను ప్రశాంతంగా కళ్ళు మూయొచ్చు అని మనసులో అనుకుంది.
కొన్ని రోజులకి సరస్వతి ఆరోగ్యం బాగా క్షీణించింది. ఆ విషయం తెలుసుకున్నాక విజయ్ పట్నం నుండి వచ్చేసాడు, సరస్వతిని మంచి హాస్పిటల్ లో చూపించి నయం అయ్యాక ఇంటికి తీసుకొచ్చాడు. సరస్వతి విజయ్ తో, నాన్న…! విజయ్ ఈ అనారోగ్యం చూస్తుంటే నేను ఎక్కువ రోజులు బ్రతికేలా లేను. నీ పెళ్లి చూడాలనేది నా ఆఖరి కోరిక. ఈ నెల రోజులలో పెళ్లి చేసుకోరా.. అని బ్రతిమాలింది.
విజయ్, అది కాదమ్మా ఇప్పటికిపుడు నచ్చిన పట్నం పిల్ల ఎలా దొరుకుతుంది..? . ఇంత సడన్ గ పెళ్లంటే మాటలా ..? అని అన్నాడు. అది విన్న సరస్వతి నయన ని పెళ్లి చేసుకోమని కోరింది. విజయ్, పల్లెటూరి పిల్లని అస్సలు చేసుకోనని,వారికి మందబుద్ధి ఉంటుంది. ఆలోచన జ్ఞానం కూడా ఉండదు అని చెప్పాడు. అయినా, సరస్వతి మొండి పట్టు పట్టడంతో విజయ్ నయనని పెళ్లి చేసుకున్నాడు.
విజయ్ నయనని తీస్కొని పట్నం వెళ్లాడు. వెళ్లిన దగ్గరి నుండి నయనని ఏదో ఒక మాటలో నువ్వు పల్లెటూరి దానివి నీకేం తెలియదు, అంటూ ఎగతాళి చేసేవాడు. నేను చెప్పినట్టు విను నువ్వు, నీ కట్టు బొట్టు కాస్త మార్చుకో, పట్నంలో చాలా స్టైల్ గా ఉండాలి. ఎవరు మాట్లాడించిన చాలా తక్కువగా మాట్లాడాలి. పల్లెటూరిలో మాట్లాడినట్టుగా బల బల మాట్లాడొద్దు, నవ్వడం కూడా చాలా చిన్నగా నవ్వాలి. ఇవన్నీ గుర్తు పెట్టుకో అని చిన్నగా హెచ్చరించాడు.
ఒకసారి విజయ్ ఆఫీస్ ఫ్రెండ్ మరియు అతని భార్య, విజయ్ ఇంటికి భోజనానికి వచ్చారు. ఫ్రెండ్ భార్య పట్నంలో పుట్టి పెరిగిన అమ్మాయి కాబట్టి, చాలా స్టైలిష్ గా ఉంది. తన కట్టు బొట్టు కూడా చాలా బాగుంది. వాళ్ళు వెళ్ళిపోయాక విజయ్ నయనతో నా ఫ్రెండ్ భార్యని చూసావా..? అలా ఉండటానికి ట్రై చెయ్ అన్నాడు. నయన, తన భర్త కోసం తన కట్టు బొట్టు చాలానే మార్చింది. చాలా అందంగా తయారవడం స్టార్ట్ చేసింది. అయినా కూడా విజయ్ ఎదో ఒక మాట అంటూ నువ్వు పల్లెటూరి దానివి నువ్వు ఎంత మారిన పల్లెతనం కనబడిపోతుంది అని వెక్కిరించేవాడు.అది విని బాధపడేది నయన .
కొన్ని రోజుల తర్వాత సరస్వతి, విజయ్ కి ఫోన్ చేసి మీ పెళ్లి జరిగితే నూకాలమ్మ గుడికి వస్తానని మొక్కుకున్నాను. నాకు ఎలాగూ ఆరోగ్యం బాగోలేదు. కాబట్టి, ఆ మొక్కు మీరే తీర్చేయాలి అని చెప్పింది. అది విన్న విజయ్ పెళ్లికి నేను అనుకోకుండా వారం రోజులు లీవ్ తీసుకున్నాను. ఇపుడు నాకు ఎట్టి పరిస్థితిలో మా బాస్ లీవ్ ఇవ్వడు. అడిగితే ఖచ్చితంగా కోప్పడతాడు అని చెప్పాడు.
అయినా సరస్వతి, అది మొక్కు తప్పకుండ తీర్చాలి . ఎలాగోలా కుదుర్చుకొని వెళ్ళమని చెప్పింది. చేసేదేమి లేక సరే అన్నాడు. కానీ.. లోలోపల బాస్ ని తలచుకుని భయపడుతూనే ఉన్నాడు. అపుడు నయన విజయ్ తో , మీ బాస్ పేరేంటి..? అని అడిగింది. నరసింహ అని బదులిచ్చాడు విజయ్ అయోమయంగా చూస్తూ. అపుడు నయన అంటే మీ బాస్ నరసింహ స్వామీ భక్తుడు కాబట్టి మీరు మీ బాస్ దగ్గరికి వెళ్లి, మొక్కు నరసింహ స్వామీ కి చెల్లించాలని చెప్పండి . ఖచ్చితంగా మీకు లీవ్ దొరుకుతుంది అని చెప్పింది.
విజయ్ బాస్ కి అలాగే చెప్పాడు. అది విన్నాక బాస్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఒక రోజు లీవ్ ఇచ్చాడు విజయ్ కి . నయన యొక్క తెలివికి సంతోషపడ్డాడు విజయ్. అదే సాయంత్రం నూకాలమ్మ గుడి ఉన్న ఊరికి బయల్దేరారు . వెళ్లేసరికి చీకటయ్యింది. అక్కడే ఉన్న సత్రానికి రాత్రి పూట ఉండడానికి రూమ్ కోసం వెళ్లారు.
సత్రానికి వెళ్లేసరికి ,అక్కడ పనిచేసేవాడు రూమ్స్ ఏమి ఖాళి లేవు . ఇక్కడి నుండి వెళ్ళండి అని విసుక్కున్నాడు. వెంటనే నయన ఆ పనివాడు వినేలా.. వేంకటాద్రి అన్నయ్య ఎప్పుడు మనింటికి వచ్చినా మా ఊరి నూకాలమ్మ గుడికి వచ్చినపుడు , మీకోసం ఒక రూమ్ తప్పకుండ ఖాళీగా ఉంటుందని చెప్తుండేవాడు.
ఈసారి రానివ్వండి అడుగుతాను అన్నయ్యని అంది. అది విన్న పనివాడు వెంటనే నవ్వుతు…. వాళ్ళ దగ్గరికి వచ్చి రూమ్స్ ఖాళీ లేవని మీకు కాదండి చెప్పంది. అదిగో ఆ వచ్చేవారికి . మీకు స్పెషల్ రూమ్ ఉంది అని తీసుకెళ్లాడు. ఇదంతా చూస్తున్న విజయ్ అయోమయంలో ఏ జరుగుతుందో అర్ధం కాకుండా ఉన్నాడు.
రూమ్ లోకి వెళ్ళాక, వెంటనే నయనని అడిగాడు విజయ్ . అసలు ఎవరు..? ఈ వేంకటాద్రి అన్నయ్య. నాకు తెలియకుండా నీకు ఈ ఊరిలో చుట్టాలున్నారా..? అని అడిగాడు. అది విని నవ్వుకున్నా నయన నాకు ఎవరు తెలియదండి, సత్రానికి వస్తున్నపుడు గేట్ దగ్గర వెంకటాద్రి ఫోటో మరియు వివరాలు చూసాను, అంటే ఈ సత్రం ఓనర్ తానే అని అర్థమైంది. అందుకే అలా అబద్ధం చెప్పాను వాడికి . అది నమ్మి మనకి రూమ్ ఇచ్చాడు పనివాడు అంది. ఇదంతా విన్న విజయ్న, నయని ఆలోచన శక్తి చూసి , అసలు తనని ఎంత తక్కువ చేసి మాట్లాడాడో అని లోలోపల సిగ్గుపడ్డాడు.
ఉదయాన్నే లేచి గుడికి బయల్దేరారు ఇద్దరూ . అప్పటికే గుడిని మూసేస్తున్నాడు పూజారి. అది చూసిన విజయ్ తల పట్టుకుని అయిపొయింది, ఇక గుడిని రేపు తెరుస్తారు. మనకి ఈ రోజు దర్శనం కుదరదు. నాకు ఒక్క రోజే లీవ్ ఉంది అంటూ గుణుక్కున్నాడు. పూజారికి వినబడేలాగా… నయన, అయ్యయ్యో గుడి మూసేస్తున్నారా..? మా అత్తయ్య గారు ఇచ్చిన దక్షిణ హారతి పళ్లెంలో వేద్దామనుకున్న, పోనిలే ఈ బయటి హుండీ లో వేసేస్తా అంది. అది విన్న పూజారి వెంటనే గుడి లోపలికి వస్తూ .. లోపలికి రండి . దేవి దర్శనానికి ,పాపం మీరు ఎక్కడినుండో వస్తున్నట్టున్నారు అంటూ తలుపు తెరిచాడు.
ఇరువురు దర్శనం చేసుకున్నాక నయన హారతి ప్లేట్ లో ఒక చిన్న మూట వేసింది. అదిచూసిన విజయ్ బయటికొచ్చాక అడిగాడు. అమ్మ ఏం ఇచ్చింది..? దక్షిణ హుండీలో వేస్తే అయిపోతుంది కదా..! అన్నాడు. నయని, అలా కాదండి మీకేమో ఒక్క రోజే లీవ్ ఉంది ఇపుడు దర్శనం కాకపోతే మళ్లి ఎప్పుడు కుదురుతుందో? అందుకే పంతులు వినేలా చిన్న అబద్ధం చెప్పాను. అసలు నాకు అత్తయ్య ఎలాంటి దక్షిణ ఇవ్వలేదు, గుడిలో ఇవ్వడానికి అంది. మరి ఆ ప్లేట్ లో వేసింది ఏంటి..? పంతులితో ఎందుకు అలా చెప్పావు అన్నాడు.
హుండీలో వేసే ఏ వస్తువు అయినా గుడి అభివృద్ధి కోసం వాడుతారు. హారతి ప్లేట్ లో వేసే దక్షిణ పూజారులు తీసుకుంటారు. అలా చెప్తే పూజారికి ఆశ కలిగి తలుపు తెరుస్తాడని చెప్పిన అంది. ఇక ప్లేట్లో వేసింది వత్తుల మూట అని చెప్పింది. ఇన్ని తెలివి తేటలకి చూసాక విజయ్ కి ఆశ్చర్యపోవడం తన వంతు అయింది.
ఈ ఊరిలో నగలు బాగా దొరుకుతాయని మా పక్కఇంటి అక్క గాజులు కొనుక్కుంది. కానీ, ఆ డిజైన్ నచ్చలేదని నన్ను మార్చుకు రమ్మని చెప్పింది అన్నాడు విజయ్, నయన తో. గాజులు నేను రూమ్ లోనే పెట్టి వచ్చాను. నేను నగల షాప్ లో డిజైన్స్ చూస్తుంటాను నువ్వు వెళ్లి గాజులు తీసుకురా అన్నాడు విజయ్ నయనతో.
సరే, అని వెళ్ళింది నయన రూమ్ కి . ఇదంతా గమనిస్తున్న ఒక దొంగ నయన వెంటే వెళ్లి మీ ఆయన గాజులు త్వరగా తీసుకురమ్మన్నాడు. షాప్ మూసే టైం అవుతుంది త్వరగా వెళ్లి తీసుకురా అని నన్ను పంపించాడు అన్నాడు. అదంతా విని నయన వీడు దొంగవెధవ అని పసి గట్టింది . వాడితో , అవునా.. అలాగా.. విజయ్ నీతో కేవలం బంగారు గాజులనే చెప్పాడా..? మరి కాసుల పేరు తీసుకురావాలో వద్దొ ఒకసారి అడిగిర అంది. అది విన్న దొంగ ఆశ ఎక్కువై బయటకెళ్ళి కాసేపటికి వచ్చి కాసుల పేరు కూడా తీసుకురమ్మన్నాడు అని అన్నాడు. అంతలోపు పోలీస్ లని పిలిచి దొంగని అప్పచెప్పింది నయన.
ఎంత సమయానికి, నయన షాప్ కి రాకపోవడంతో విజయ్ రూమ్ కి వచ్చే సాడు. పోలీస్ లు నయన ధైర్యానికి మరియు తెలివితో దొంగని పట్టించినందుకు అభినందిచారు. ఇదంతా చూస్తూ నిలబడటం విజయ్ వంతు అయింది. ఇన్ని తెలివి తేటలున్న నయననా…? నేను ఇన్ని రోజులు నానా మాటలన్నది. పల్లెటూరి పిల్ల తాను కాదు. ఎంతో తెలివి ఉన్న అమ్మాయి. నేను చాలా తప్పు చేశాను. అని గ్రహించి, నయనని క్షమించమని అడిగాడు. అప్పటినుండి వారివురు చాలా సంతోషంగా ఉన్నారు. నయన ఎప్పటికప్పుడు విజయ్ ని తన తెలివితో ఆశ్చర్యపరుస్తూనే ఉంది.