చల్లటి శీతాకాలంలో…. ఒకరోజు అక్బర్ మరియు బీర్బల్ ఇద్దరు ఒక సరస్సు పక్కన నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇద్దరు ఒకరికొకరు తమ భావాలను వ్యక్తం చేసుకుంటున్నారు.
బీర్బల్ తన ఆలోచనను అక్బర్ కి చెప్పాడు. రాజా నాకు తెలిసి ఒక వ్యక్తి డబ్బు కోసం ఏమైనా చేస్తాడు. దీనిని మీరు సమర్థిస్తారా..!? అని అడిగాడు. అక్బర్, డబ్బు కోసం ఎదో ఒకటి చేయడం అయితే సరే. కానీ ఏదైనా చేయడం అనేది అసాధ్యం. ఉదాహరణకి ఈ సరస్సులోని నీరు చాలా చల్లగా ఉంది ఇందులో ఎవరైనా ఒక రాత్రి మొత్తం ఉండగలరా..!? అలా ఉన్నవారికి నేను వెయ్యి బంగారు నాణేలని బహుమతిగా ఇస్తాను అన్నాడు.
అది విన్న బీర్బల్… రాజా అలాంటి వారు ఉంటారు. డబ్బుకోసం ఏమైనా చేసేవారు తప్పకుండా ఉంటారు అని బీర్బల్, అలా చేసేవారు ఉండరని అక్బర్ … ఇలా ఒకరికొకరు తమ అభిప్రాయాలతో వాదించుకుంటున్నారు.
బీర్బల్, సరే రాజా..! నేను రేపటిలోపు ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తిని తీసుకొస్తాను అని వెళ్లిపోయాడు. సహజంగా ఎపుడు జరిగే సంభాషణల్లో బీర్బల్ దే గెలుపు. కానీ, ఈ సారి అక్బర్ కి గెలుపు తన వైపే ఉందని అనుకున్నాడు.
మరునాడు ఒక పేద బ్రాహ్మణున్ని సభలో ప్రవేశపెట్టాడు బీర్బల్. అక్బర్ తో మీరు చెప్పిన పనిని చేయడానికి ఇతను సిద్ధంగా ఉన్నాడు ప్రభు అన్నాడు. అక్బర్ ఆజ్ఞ తో ఆ బ్రాహ్మణుడు ఆ రాత్రంతా సరస్సులోని చల్లని నీటిలో ఉన్నాడు.
అది చూసిన అక్బర్ ఆశ్చర్యపోయాడు. శరీరాన్ని చలనం లేకుండా చేసేంత చల్లని నీటిలో అలా ఎలా ఉండగలిగావు..? అని అడిగాడు. అందుకు సమాధానంగా ” రాజా..! సరస్సు పక్కనే ఉన్న వీధి దీపం యొక్క వెలుతురు మరియు వెచ్చదనం ఆ సరస్సులో ఒక మూలాన పడుతున్నాయి అది గమనించిన నేను ఆ వెచ్చదనంలో రాత్రి మొత్తం ఉండగలిగాను అన్నాడు.
దానికి అక్బర్, ఇది నేను ఒప్పుకోను. నీకు నేను బహుమతిని ఇవ్వను. నేను సరస్సులో రాత్రంతా ఉండమన్నాను. కానీ, నువ్వు ఆ వీది దీపం యొక్క వెచ్చదనాన్ని ఆసరాగా చేసుకున్నావు అన్నాడు. అందుకు ఆ పేద బ్రాహ్మణుడు, ఎలాగైతే ఏంటి ప్రభు మీ ఆదేశం మేరకు నేను రాత్రంతా సరస్సులో ఉన్నాను అని బదులిచ్చాడు.
కానీ, అక్బర్ దానికి ఒప్పుకోలేడు మరియు బహుమతిని కూడా ఇవ్వలేడు. అక్బర్ తానే గెలిచానని సంతోషంలో ఉన్నాడు. చేసేది ఏమి లేక ఆ బ్రాహ్మణుడు బీర్బల్ దగ్గరికి వెళ్లి జరిగింది చెప్పాడు.
మరునాడు.. బీర్బల్ సభకి వెళ్లలేదు. బీర్బల్ రాక కోసం అక్బర్ చాలా సమయం నుండి ఎదురుచూస్తున్నాడు. బీర్బల్ ని సభకి తీసుకురమ్మని భటులని ఆదేశించాడు. భటులు బీర్బల్ ఇంటికి వెళ్లారు. బీర్బల్ భటులతో.., నేను ఈ కిచిడి(అన్నం) చేసుకుని తిన్న తర్వాతే సభకు వస్తానని చెప్పాడు.
భటులు రాజుతో అదే విషయాన్ని చెప్పారు. అక్బర్ చాలా సమయం గడిచాక బీర్బల్ ఇంకా రాకపోవడంతో, సభని ముగించి బీర్బల్ ఇంటికి వెళ్లాడు.
ఇంట్లో.. బీర్బల్ కూర్చొని ఉన్నాడు అతనికి ఎదురుగా నిప్పుపైన దాదాపు పది అడుగుల ఎత్తులో కిచిడి నిండిన గిన్నెను ఉంచాడు. అది చూసిన అక్బర్ గట్టిగా నవ్వుకున్నాడు. బీర్బల్ తో ఇదా..! కారణం నువ్వు సభకి రాకపోవడానికి అని, కిచిడి గిన్నెకి నిప్పు అంటకుండా అంత పైనకి కడితే అది ఎలా తయారవుతుంది..? గిన్నెకి కావలసిన వేడి తగిలితేనే అది తయారవుతుంది గిన్నెకి వేడి తగలడమే కిచిడి అవడానికి ఆసరా అన్నాడు అక్బర్.
అది విన్న బీర్బల్, ఆ పేద బ్రాహ్మణుడు కూడా చల్లని నీటిలో ఉండటానికి ఒక ఆసరా తీసుకున్నాడు. సరస్సు పక్కన దీపం ఉండడం తప్పు కాదు. కానీ ,అతని తెలివితో ఆ వెచ్చదనాన్ని తీస్కొని రాత్రంతా అంత చల్లని నీటిలో ఉన్నాడు. ప్రతి ఒక్కరు అనుకున్నది సాధించడంలో ఒక ఆసరా మరియు నమ్మకం ఉండాలి ఆ బ్రాహ్మణుడికి ఆ వీధి దీపం ఒక నమ్మకాన్ని ఇచ్చింది ఆ ఆసరాతో అనుకున్నది సాధించాడు. దానిని మీరు తప్పు పట్టి అతని కష్టానికి తగిన బహుమానం ఇవ్వలేరు అన్నాడు బీర్బల్.
తాను చేసిన తప్పుని గ్రహించిన అక్బర్ వెంటనే ఆ బ్రాహ్మణుడిని పిలిచి తగిన బహుమానం ఇచ్చాడు.