కపాలి మరియు ప్రశ్నా శాస్త్రం | Kapaali And His Secret
కపాలి మరియు ప్రశ్నా శాస్త్రం | Kapaali And His Secret

ఒక ఊరిలో రాముడు, లక్ష్మమ్మ  అను దంపతులు ఉండేవాళ్ళు వారికి ఉన్నంతలో చాలా  బాగా జీవనం గడిపేవారు. చాలా కాలంగా వారికి పిల్లలు పుట్టలేరు. ఎన్నో దేవుళ్లను దర్శించి వేడుకున్నారు. చాలా కాలం తర్వాత వారికి ఒక మగ పిల్లాడు పుట్టాడు.

ఇరువురు దంపతులు చాలా ఆనందపడ్డారు. ఆ పిల్లవాడికి కపాలి అని పేరు పెట్టారు. చాలా కాలం తర్వాత పుట్టిన సంతానం పైగా అబ్బాయి అయ్యేసరికి వాడిని చాలా  గారాబంగా పెంచుతూ సోమరిపోతును చేసారు. వాడికి వాళ్ళ అమ్మ, నాన్న, తినడం మరియు  ఆడుకోవడం తప్పితే లోకజ్ఞానం లేదు. ఒక్కపని కూడా రాదు.  చేయడానికి చాతకాదు.

కొన్ని సంవత్సరాల తర్వాత ఇరుగు పొరుగు వారు హేళన చేయడం మొదలు పెట్టారు. కపాలికి ఏ పని  రాదనీ.  అపుడు రాముడు కపాలిని పనికి పంపాడు. కానీ,ఎప్పుడు పని చేయనందు వల్ల కపాలికి పని అబ్బలేదు.

అలాగే కపాలి  పెళ్లికి ఎదిగాడు. ఊర్లన్నీ తిరిగి మంచి అమ్మాయిని చూసి కపాలికి ఇచ్చి పెళ్లి చేసారు . కొన్నాళ్లకి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు అయిపోయింది.  కపాలి తల్లి తండ్రులు కూడా మరణించారు. కపాలి ఆ ఊరు వదిలి వేరే ఊరు వెళ్ళాడు.  పని చేసుకొని బ్రతకడానికి.

అక్కడ ఉన్న ఒక ధనవంతుడి ఇంటికి వెళ్లాడు కపాలి. ఆ ఇంటి యజమానిని కలిసి అయ్యా! నేను ఈ ఊరికి కొత్తగా వచ్చాను. నాకు ఏదైనా పని ఇప్పించండి చేస్కుంటూ మీకు రుణపడి ఉంటాను అన్నాడు.

అప్పుడు యజమాని నీకు ఏ పని వచ్చు? అని అడిగాడు.  కపాలి , అయ్యా! నాకు పుట్టుకతో ఏ పని అబ్బలేదు అన్నాడు. యజమాని కపాలిని చూసి తోటకి కావలి కాస్తావా!? అని అడిగాడు. కపాలి సంతోషంగా సరే అని ఒప్పుకున్నాడు.

కొన్ని రోజులకి యజమాని కూతురి వివాహం కుదిరింది. ఎక్కడెక్కడి నుండో బంధువులని పిలిచి చాలా ఘనంగా వివాహం జరిపిస్తున్నారు. చాలా రకాల వంటకాలను సిద్ధం చేయిస్తున్నారు. అవన్నీ చూసి కపాలికి, ఎన్నో రోజుల నుండి సరిగా తినడం లేదు కనీసం ఈ పెళ్లిలో  అయినా  నా  జిహ్వ కోరిక తీర్చుకుంటా అని అనుకున్నాడు. కానీ యజమాని ఊర్లో అందరిని మరియు  చివరికి ఇంట్లో పని వాళ్ళని కూడా పిలిచాడు. కానీ, కపాలిని పెళ్లికి పిలవలేదు.

దానితో కపాలికి చాల బాధేసింది వాళ్ళ తల్లి తండ్రులను గుర్తు చేసుకున్నాడు. మీరు నాకు సరైన పని నేర్పించి ఉంటె నేను పని చేస్కుంటూ  బాగా బ్రతికే వాడిని, ఎంతో ఆశపడ్డాను నా  జిహ్వ కోరికను ఇలాగైనా తీర్చుకుందామని. కానీ, యజమాని నన్ను చాల అవమానించాడు .

యజమానికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అనుకున్నాడు. పెళ్లి కొడుకు ఊరేగింపుకు తీస్కొచ్చిన  గుర్రాన్ని అర్ధరాత్రి ఎవరికి తెలియకుండా తీసుకెళ్లి  ఊరి చివర ఒక చెట్టుకి కట్టేసాడు. తెల్లారేసరికి గుర్రం కనిపించకపోవడంతో అందరు కంగారు పడి వెతకడం ప్రారంభించారు. అటుగా వెళ్తున్న కపాలి భార్య యజమాని దగ్గరికి వెళ్లి, అయ్యా! మీ గుర్రం కనబడటం లేదని విన్నాను. మా ఆయన కపాలీకి ప్రశ్నా శాస్త్రం లో మంచి పట్టు ఉంది, పిలిపించి అడగండి మీ గుర్రం ఆచూకీ తెలుస్తది, అని చెప్పింది.

యజమాని కాపలిని పిలిచి గుర్రం  ఎక్కడుందో చెప్పమన్నాడు. దానితో కపాలి ఏదో లెక్కలు వేస్తున్నట్టు చేసి ఊరికి  చివర్లో   దక్షిణాన ఒక చెట్టుకి  కట్టేసి ఉంది, ఇప్పుడే పని వాళ్ళని వెళ్లి తీసుకురమ్మనండి దొరుకుతుంది అని చెప్పాడు.

వెంటనే పనివాళ్ళు వెళ్లి గుర్రాన్ని తీసుకొచ్చారు. యజమాని కపాలి ప్రశ్నల శాస్త్రానికి ఆశ్చర్యపోయాడు. ఇంటికి పిలిచి ఘనంగా సన్మానం చేసి మంచి విందు ఇచ్చాడు. అలా అందరిని మోసం చేసి కపాలి తన జిహ్వ కోరికను తీర్చుకున్నాడు.

ఊర్లో అందరు కపాలి గొప్పదనం గురించి మాట్లాడుకోసాగారు. అలా ఇలా అందరికి మరియు  రాజుగారి వరకు వెళ్ళింది కపాలి గురించి.

ఒకరోజు మహారాణి రవ్వలహారం కన్పించకుండా పోయింది. ఆ హారం   “జిహ్వ “అను పేరు గల  మహారాణి చెలికత్తె దొంగిలించింది.  హారం ఆచూకీ తెలుసుకోవడానికి రాజుగారు కపాలిని పిలిపించాడు .

రాజుగారి నుండి పిలుపు రాగానే కపాలి భయపడుతూ వెళ్ళాడు. రాజుగారు రవ్వల హారం ఆచూకీ చెప్తే తగిన బహుమానం ఇస్తానని చెప్పారు. కపాలి, రాజావారు ! నాకు ఒక్క రోజు గడువు ఇవ్వండి అని అడిగి తన గదిలోకి వెళ్లిపోయారు.

ఇది విన్న చెలికత్తె “జిహ్వ” తన దొంగతనం బయట పడుతుందేమో అని బయపడి పోయి కపాలికి కొంత డబ్బు ఇచ్చి పంపించేద్దాం అని కపాలి గదికి వెళ్ళింది..

అప్పటికే కపాలి దిగాలుగా కూర్చొని ఇలా అన్నాడు. ” నా  జిహ్వ కోరికను తీర్చుకోవడానికి లేని పోనీ అబద్ధాలు చెప్పాను.  ఇపుడు నేను  హారం ఆచూకీ చెప్పకపోతే రాజావారికి కోపం వచ్చి నన్ను శిక్షిస్తారేమో ?” అంటూ ఉండగా అది విన్న చెలికత్తె “జిహ్వ” కపాలి తనని కనుక్కునాడు అని  భయపడిపోయి వెళ్లి కపాలి కాళ్ళమీద పడి  నన్ను క్షమించి  రక్షించండి. నేనే చెలికత్తె “జిహ్వ” ని నా  కోరిక తీర్చుకోవడానికే  హారం దొంగిలించానని నిజం చెప్పింది. అది వినగానే సంతోషపడ్డ కపాలి హారం ఎక్కడ దాచిపెట్టావో చెప్పు అన్నాడు.

కపాలి మరునాడు సభలో రాజుగారికి, హారం దొంగిలించి దొంగ  తోటలోని మామిడి చెట్టు మొదలులో దాచిపెట్టాడు భటులని  పంపించి వెతకమనండి అన్నాడు కపాలి . కపాలి అన్నట్టుగానే హారం దొరికింది.

ఆరోజు నుండి కపాలిపేరు అన్ని రాజ్యాలకు వ్యాపించింది.. రాజుగారు సంతోషంతో కపాలిని సలహాదారునిగా నియమించి అన్ని సదుపాయాల వైభోగాలు ఇచ్చాడు. ఇదంతా చూస్తున్న ఆస్థాన  మంత్రికి కపాలి పైన అనుమానం కలిగి, ఎలాగైనా కపాలి గురించి తెలుసుకోవాల్సిందే  అని అనుకున్నాడు .  ఒకరోజు ఒక కుండలో పక్కనే వెళ్తున్న కప్పని పట్టుకుని వేసి దానికో గుడ్డ కట్టి ఆస్థానానికి తీసుకొచ్చాడు.  అందరిముందు  కపాలిని మీరు ప్రశ్నా శాస్త్రం లో ఎంతో ప్రావిణ్యం కలిగి ఉన్నారు కదా !ఇందులో ఏముందో చెప్పగలరా ?! అని అడిగాడు.

అంతటితో కపాలి మొహం దిగాలుగా పెట్టి లోలోపల ఏడుస్తూ ఒరేయ్ కప్పాయ్  చివరకు ఇలా ఇరికిపోయావన్నమాట అని  అన్నాడు.  అది విన్న మంత్రి, కపాలి కాళ్ళకి నమస్కరించి కపాలి గారు మీరు చాలా గొప్పవారు.  మిమ్మల్ని నేను అనవసరంగా అనుమానించాను.  నన్ను క్షమించండి అని అన్నాడు.

అసలు అందులో కప్ప  ఉన్న విషయం కపాలికి తెలియదు. ఇదే అదను అనుకుని ఇకనుండి నేను చిన్న చిన్న విషయాలు పరిష్కరించి, నా ప్రశ్నా శాస్త్రానికి  అవమానం కలిగించను అని అక్కడినుండి వెళ్ళిపోయాడు.

నీతి 1 | Moral 1: అతి జిహ్వ కోరిక అనర్థానికి మూలం.

నీతి 2 | Moral 2:  క్లిష్ట పరిస్థితులలో తెలివి తేటలతో ఆలోచిస్తే   మనల్ని మనం రక్షించుకోవచ్చు.

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *