ఒక అడవిలో అన్ని జంతువులతో పాటు ఒక కోతుల గుంపు కూడా ఉండేది. ఆ కోతుల గుంపు చాలా అల్లరి చేస్తూ ఆడుతూ పాడుతూ, మిగతా జంతువులతో చాలా స్నేహంగా ఉండేవి. కానీ ఎప్పుడు కూడా ఆ కోతుల గుంపు మొసళ్ళతో మాత్రం స్నేహం చేయకపోయేవి.
మొసళ్ళు ఉండే వాగు దగ్గరికి వెళ్లినపుడు, మొసళ్ళు స్నేహభావం ప్రదర్శించిన కోతులు అసలు పట్టించుకునేవి కాదు. ఎందుకంటే కోతులు, మొసళ్ళని కపట మోసగాళ్లు అని అనుకునేవి. అందుకే అసలు స్నేహం చేయకపోయేవి. కానీ, అందులో ఒక కోతి మాత్రం ఆ మాటలేవి పట్టించుకోకుండా ఎవరికీ తెలియకుండా ఒక మొసలితో స్నేహం చేసింది.
ప్రతీరోజు మొసలి ఉండే వాగు దాగ్గరికి వెళ్లి చాలా సమయం మొసలితో గడిపేది. అలా వాళ్ళిద్దరి మధ్య స్నేహం బాగా కుదిరింది.
అది గమనించిన మిగతా కోతులన్నీ ఆ కోతిని చాలా తిట్టాయి . నువ్వు తప్పకుండ ఆ మొసలి చేతిలో మోసపోతావు అన్నాయి. అయినా కూడా ఆ కోతి పట్టించుకోకుండా తన స్నేహం ఆ మొసలితో కొనసాగించింది.
ఇదంతా ఇలా ఉండగా ఆ కోతుల గుంపు ప్రతీరోజు పక్కనే ఉన్న గ్రామాలకి వెళ్లడం ,వారి పంటలను పాడుచేయడం మరియు పండ్లు తుంచేసి పడేయడం, జనాలని బాగా భయపెట్టడం చేస్తూ అవి బాగా ఎంజాయ్ చేస్తాయి.
ప్రతీరోజు కోతుల అల్లరిని భరించలేక, వారి పంట నష్టాన్ని తట్టుకోలేక రైతులందరూ ఆ గ్రామా సర్పంచ్ కి ఫిర్యాదు చేసారు. ఆ సర్పంచ్ కోతులను ఎలాగైనా జూ లోకి పంపించాలని ప్రభుత్వంతో మాట్లాడారు.
ఇక ఆరోజు నుండి సర్కారువారు ప్రతీరోజు కోతుల కోసం అడవిని గాలించడం ప్రారంభించారు. దొరికిన కోతులని తీసుకెళ్లి జూ లో వదిలిపెట్టడం చేస్తున్నారు.
అలా రోజూ కోతులని పట్టుకెళ్ళడం వల్ల, అడవిలో కోతుల సంఖ్య తగ్గిపోతూ వచ్చింది. అలాగే కోతులు గ్రామాలపైనా చేసే దాడి కూడా తగ్గింది.
ప్రతీరోజులాగే కోతి వాగు దగ్గర ఉన్న చెట్టు దగ్గరికి వెళ్లి దిగాలుగా కూర్చుంది. అంతలోనే అక్కడికి వచ్చిన మొసలి కోతి దిగులుగా ఉండటం గమనించి, ఏమైంది? అని అడిగింది. అపుడు కోతి, అడవిలో నుండి మమ్మల్ని పట్టుకెళ్లి జూ కి తీసుకెళ్తున్నారని, ఇప్పటికే తన స్నేహితులందరిని తీస్కెళ్లిపోయారని చాలా బాధతో చెప్పింది.
అది విన్న మొసలి తెలివిగా ఆలోచించి,ఈ అడవిని వదిలి ఈ వాగుకి అటువైపున ఉన్న అడవికి వెళ్లిపోండి. అపుడు మీరు జూకి వెళ్లే బాధ తప్పుతుంది మరియు నువ్వు నాతో రోజు ఇలాగె మాట్లాడవచ్చు అని చెప్పింది. అది విన్న కోతి చాలా సంతోషంగా ఈ ఆలోచన చాలా బాగుంది. నేను వెంటనే నా స్నేహితులకి చెప్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోయింది.
మొసలి చెప్పిన సలహా కోతి స్నేహితులకి చెప్పింది. అది విన్న మిగతా కోతులలో కొన్ని ఆ సలహాని సమర్ధించాయి. కానీ, కొన్ని కోతులు మాత్రం ఇది ఆ కపటి మొసళ్ల నాటకం. మనల్ని చంపి తినడానికే వాళ్ళు ఇలాంటి పథకం వేసాయి అని అన్నాయి.
కానీ.. ఈ సలహా విన్న మిగతా జంతువులు కూడా ఈ ఆలోచన బాగుంది. ఇపుడు మీరు ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి, కనీసం ఈ ప్రయత్నం అయినా చేయండి అని చెప్పాయి. అందులో ఒక కోతి ముందుకి వచ్చి ఇదంతా బాగానే ఉంది కానీ అసలు మేము అంత పెద్ద వాగుని ఎలా దాటగలము? అని అంది. అది విన్న జంతువులన్నీ ఇది నిజమే కదా! అసలు వీరంతా వాగు ఎలా దాటుతారు? అని ఇక ఆ ఆలోచనని వదిలేసాయి .
మరుసటి రోజు కోతి మొసలి దగ్గరి వెళ్లి జరిగిన విషయం చెప్పింది. అదంతా విని నవ్వుకున్న మొసలి, సలహా ఇచ్చిన నేను మిమ్మల్ని కాపాడలేనా ? అని అంది, మీరంతా మా వీపు మీద కూర్చోండి మేము మిమ్మల్ని వాగు దాటిస్తాము అని అంది.. అది విన్న కోతి సంతోషంతో మిగతా కోతులకి చెప్పింది. ఇక ఆ మాట విన్న మిగతా కోతులు ససేమిరా వద్దు అన్నాయి.
కానీ కొన్ని కోతులు మాత్రం మేము నీతో పాటు వస్తాము. మమల్ని రక్షించు అని అడిగాయి. మరునాడు కొన్ని కోతులు కలిసి వాగు దగ్గరికి వెళ్లాయి. కోతి స్నేహితుడైన మొసలి తన మిగతా స్నేహితులని కూడా పిలిచి ఆ కోతులన్నిటిని వాటి వీపుపైన ఎక్కించుకుని ఒక రోజంతా ఈదుకుంటూ వెళ్లి వాగుకి అటు పక్కన ఉన్న అడివిలో వదిలేసాయి .
మొసళ్ళు చేసిన సహాయానికి కోతులన్నీ చాలా కృతజ్ఞత తెలియచెప్పాయి “మిమ్మల్ని మరియు మీ ఆకారాన్ని చూసి మేమెప్పుడూ స్నేహం చేయలేము. పైగా మీరు మోసగాళ్ళని అనుకునేవాళ్లం . కానీ, మమ్మల్ని చాలా పెద్ద ప్రమాదం నుండి తప్పించారు అని” .
అడవిలో ఉండిపోయిన మిగతా కోతులని మరునాడు జూ కి తీసుకెళ్లిపోయారు. అలా ముగిసింది గ్రామ ప్రజల కోతుల బాధ.