జయం - అపజయం | Practice Makes Man Perfect
జయం – అపజయం | Practice Makes Man Perfect

సాయం సమీరాలు ట్యాంకుబండ్  పరిసరాలని సుతారంగా ముద్దుపెడుతున్నాయి. నెక్లస్ రోడ్ అంత పిల్లలతో,పెద్దలతో,తమలోకంలో ఉన్న జంటలతో సందడిగా ఉంది. క్రిష్  శ్వేత కోసం వెయిట్ చేస్తున్నాడు గత పది నిమిషాల నుండి.

            “క్రిష్…! ఏంటి ఇవ్వాళ తొందరగా వచ్చేసావ్….? అటు సూరీడు ఇటు పొడిచాడు ఏమిటి …? ” బైక్ పార్క్ చేస్తూ ఎదురుగా ఉన్న క్రిష్ ని అడిగింది శ్వేత.

“అంత తొందరేంటో దొరగారికి…? నాకు ఇప్పుడే అందిన వార్త. సౌత్ జోన్ లో ఫుట్ బాల్ టోర్నమెంట్ వచ్చే వారం మొదలవుతుంది. నువ్వు కూడా రిజిష్టర్ చేసుకో. నీకు చాలా బాగా పేరొస్తుంది. అక్కడ నీకు గుర్తింపు కూడా లభిస్తుంది. నువ్వు స్టేట్ ప్లేయర్ గా ట్రై చేయొచ్చు. తరువాత నేషనల్,ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వెళ్లొచ్చు…” అని పరుగెత్తుకుని వచ్చి శ్వేత గుక్కతిప్పుకోకుండా చెప్పింది.

అవునా…! నాకున్న టాలెంటుతో తప్పకుండ ఇంటర్నేషనల్ లెవెల్ కి రీచ్ అవుతాను. నువ్వు చూస్తుండు శ్వేతా…! నీకు గొప్ప టాలెంట్ ఉంది. ఎక్కడ నుండి తెలుసుకుంటావో కానీ, నీకు మాత్రం ఇలాంటి న్యూస్ లన్ని నాకంటే ముందుగానే తెలుస్తాయి…”

 ” అవును మరి…! నువ్వు ఎంతసేపు నీ ఆట, నీ స్నేహితులు తప్ప ఇంకేం పట్టించుకోవుగా… అందుకే ఒక ఫ్రెండ్ గా   నాకు తప్పదు. నువ్వు ఈ జిల్లాలోనే బాగా ఆడతావనీ వన్ అఫ్ ది బెస్ట్ ప్లేయర్ అని మా నాన్న గారితో మీ కోచ్ చెప్పారు. నిన్ను ఇంటర్నేషనల్ ప్లేయర్ గా చూడాలని నా ఆశ…”

‘ఎస్.. దట్ ఈజ్ క్రిష్..’  అని కాలర్ ఎగరేసుకుంటూ  కించిత్ గర్వంతో చెప్పాడు. శ్వేత పైకి ‘ఆహ..!’ అంటూ నవ్వినా, మనసులో మాత్రం క్రిష్ గొప్పదనానికి మురిసిపోయింది.

   ‘సరే నేను ఈ న్యూస్ రాజ్ కి కూడా చెప్తాను. మేమిద్దరం కలిసి ఈ టోర్నమెంట్ కి రిజిష్టర్  చేసుకుంటాం రేపే…’ అని చీకటి పడుతుండడంతో ఇద్దరూ ఇంటి ముఖం పట్టారు.

  క్రిష్,శ్వేత,రాజ్ ఈ ముగ్గురు స్కూల్ నుండి కూడా బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు డిగ్రీ చదువుతున్నారు. శ్వేత చదువుల్లో ఫస్ట్ అయితే క్రిష్ ఫుట్ బాల్ లో ఎంతో నేర్పు కలిగిన ఆటగాడు. రాజ్, క్రిష్ అంత కాకపోయినా ‘ఫర్వాలేదు’ అనేలా ఆడతాడు. కానీ,కష్టజీవి. క్రిష్ కి ఫుట్ బాల్ లో ఎలా వచ్చిందో కానీ చాలా నేర్పు వచ్చింది. ఎంతో నైపుణ్యం ఉన్నవాడిలా,అందరికంటే వైవిధ్యంగా గేమ్ ఆడతాడు. ఫుట్ బాల్ ఎంత బాగా ఆడతాడో , అంత బద్ధకం కూడా…!

వాళ్ళు చదువుకున్న స్కూల్ తరపున జిల్లా లెవెల్లో,ఇంటర్ స్కూల్ లెవెల్లో ఫుట్ బాల్ ఆడేవారు. క్రిష్ టీం లో ఉంటె ఫైనల్ కప్ ఎప్పుడూ వాళ్ళ స్కూల్ కె దక్కేది. క్రిష్ గేమ్ బాగా ఆడతాడని, బెస్ట్ ప్లేయర్ అవార్డ్స్ గెలుచుకున్నాడని జిల్లా చుట్టుపక్కల కూడా చాలా పేరు వచ్చింది. దానితో క్రిష్ తో స్నేహం చేసుకోవాలి అనుకున్న ఆడ, మగ ఫ్రెండ్స్ ఎక్కువైపోయారు.

క్రిష్ కి తండ్రి లేడు. తల్లి ఒక స్కూల్ టీచర్ గా పనిచేసేది. ఉన్నంతలో ఆ తల్లి క్రిష్ ని బాగా చదివించుకొని,ఫుట్ బాల్ ఆడుకోవడానికి అవసరమయ్యేవన్ని కొనిచ్చేది. రాజ్ ఒక నిరుపేద కుటుంబంలో పుట్టాడు. తండ్రి ఆటో డ్రైవర్. అతని రాబడితోనే ఇంట్లో నలుగురు పిల్లల్ని చదివించుకుంటున్నారు. శ్వేత కొంచెం ఉన్నింటి పిల్ల. క్రిష్ అంటే ప్రాణం. ఎప్పుడు క్రిష్ ఎదగాలని,మంచి పేరు తచ్చుకోవాలని తాపత్రయపడటమే కాకా, ఉన్నంతలో తనకు తోచిన హెల్ప్ చేస్తూనే ఉండేది.

క్రిష్ కొంచెం పేరు అభిమానులు, స్నేహితులు,గర్ల్ ఫ్రెండ్స్ పెరగగానే ఎక్కువ సమయం వాళ్ళతో కబుర్లతోనే కాలం గడుపసాగాడు. రాజ్ కూడా ఆ గుంపులో కాసేపు కూర్చుంటాడు. కానీ, ఫుట్ బాల్ ప్రాక్టీస్ మానడు. రోజుకి కనీసం ఒక అయిదారు గంటలు ఫుట్ బాల్  ప్రాక్టీస్ తప్పకుండా  చేస్తాడు.  క్రిష్ వారానికి అయిదారు గంటలు మాత్రమే ప్రాక్టీస్ చేస్తాడు.

క్రిష్,రాజ్ ఇద్దరు ఒక క్లబ్ లో ఫుట్ బాల్ కోచింగ్  కి జాయిన్ అయ్యారు. క్రిష్ ఎప్పుడు కోచింగ్ కి లేటే. రాజ్ మాత్రం టైం కి వచ్చేసేవాడు. కోచింగ్ సర్ దగ్గర ఆ విషయంలో మంచి మార్క్స్ కొట్టేస్తాడు రాజ్.  ఎక్కడెక్కడ టోర్నమెంట్స్ జరుగుతున్నాయో స్వయంగా కనుక్కొని, అక్కడ రిజిష్టర్ చేసుకుని ఆడుతుండేవాడు. క్రిష్ మాత్రం కోచింగ్ కి లేట్ గా వస్తుండేవాడు. కారణం కొంచెం బద్ధకం.కొంచెం ఎడతెరిపి లేకుండా బాతాఖానీ.

    రెండు రోజుల తరువాత శ్వేత ఫోన్ చేసింది క్రిష్ కి. 

   శ్వేత : ‘హాయ్ క్రిష్…! టోర్నమెంట్ కి రిజిష్టర్ చేసుకున్నావ్ లేదా ఇంతకీ…?

  క్రిష్ : ఏంటి తల్లి…! పొద్దున్నే లేవకండానే నీ గోడవ…? రిజిష్టర్ ఏ కదా చేసుకుందాం. తొందరేముంది…?

  శ్వేత : అదికాదు క్రిష్..! ‘టైం  అయిపోతే మంచి ఛాన్స్ మిస్ అవుతుంది. ఇలాంటివి మిస్ చేసుకోకూడదు. అవకాశం ఎప్పుడు పడితే అప్పుడు రాదు  కాదా ..! వచ్చినపుడే దాన్ని చేజిక్కించుకోవాలి .’

క్రిష్ : పొద్దున్నే ఉపదేశం మొదలెట్టిందిరా బాబు …! కరెక్ట్ శ్వేతా.. ఏ అవకాశాన్ని వదులుకోకూడదు. నేను ఈ సంవత్సరం లోపల మంచి పేరు తెచ్చుకోవాలి. ఇంటర్నేషనల్ ప్లేయర్ గా ఈ ప్రపంచంలో గుర్తింపు పొందాలి. అదే గా నీ ఆశ. తప్పకుండ చేస్తా అన్నాడు. ఆ మాట విన్న శ్వేత మనసులో పొంగిపోయింది.

శ్వేత : ‘సరే మరి తప్పకుండ రిజిష్టర్ చేసుకో.. ఓకే నా… ? ఉంటాను…’అని ఫోన్ పెట్టేసింది.

క్రిష్ మాత్రం తన ఫ్రెండ్స్ రాగానే వాళ్ళతో కబుర్లలో పడిపోయాడు. రిజిష్టర్ చేయాల్సిన ఆఖరి తేదీ కాస్త గడిచిపోయింది. రాజ్ మాత్రం రెజిస్ట్రేషన్ చేసుకోవడమే కాక రోజు ప్రాక్టీస్ చేస్తూ, ఫుట్ బాల్ వీడియోస్ చూస్తూ, ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చెయ్యడం మొదలుపెట్టాడు.

ఆర్నెల్ల తరువాత …..

‘క్రిష్…! ఎక్కడున్నావ్..?’ శ్వేతా కొంచెం కోపంగా క్రిష్ ని అడిగి, అర్జెంట్ గా క్రిష్ ని కాఫీ డే దగ్గరకు రమ్మంది.

క్రిష్ నేను అపుడు టోర్నమెంట్  కి రిజిష్ట్రేషన్ చేసుకోమంటే చేసుకోలేదు. అదే రాజ్ చూడు ఏంచక్కా    రిజిష్టర్ చేసుకున్నాడు. మళ్లి  ఇప్పుడు నేషనల్స్ కి కూడా సెలెక్ట్ అయ్యాడు. నువ్వెందుకు అంత బద్ధకిస్తావు..? మళ్లి  మళ్లి  అవకాశాలు వస్తాయా…? నాన్న గారిని అడిగి రికమెండ్ చేద్దాం అంటే, నువ్వు బద్ధకిష్టుడివని, కబుర్లు తప్ప కార్యాచరణ లేదని మా నాన్న నీ పట్ల ఆసక్తి చూపడం లేదు…

      ‘ ఓహ్  నీ బాధ అదా?…  పిచ్చిదానా.. టోర్నమెంట్ ఆడితే సరిపోతుందా…? నాకున్న టాలెంట్ ఈ స్టేటులోనే ఎవరికి  లేదు. ఒక్కసారి ఇంటర్నేషనల్ లో నా గేమ్ చూస్తే ఇంక నన్ను వదలరు. నాకు అవకాశం ఇస్తారు. ఒక్కసారి అవకాశం ఇస్తే చాలు. నా తఢాఖా ఏంటో ఈ ప్రపంచమే చూస్తుంది. ఆ నమ్మకం నాకుంది. నీకు కూడా ఉండాలి…’

       ‘ ఉంది  క్రిష్..! నీ ఆట మీద నాకు చాలా  నమ్మకమే ఉంది. కానీ, వచ్చిన ప్రతీ అవకాశాన్ని జాడావిడుచుకుంటున్నావు  నీ బద్దకంతో…’

     ‘ వస్తుంది పిల్లా..! నువ్వేం  కంగారు పడకు. నేను రిజిష్టర్ చేసుకోవాలి అనుకున్న. కానీ నాకు బోల్డన్ని సమస్యలు. అమ్మకి ఒంట్లో బాగోలేదు. పెదనాన్న గారితో ఆస్తి గొడవలు. వాటితోనే సరిపోతుంది. నా మూడ్ కూడా ఈ మధ్య బాగుండట్లేదు. ఏంటో అన్నీ నాకే ఇలా జరుగుతున్నాయి…’

    ‘ నీకే కాదు క్రిష్…! ఈ ప్రపంచంలో కష్టం లేని మనిషే లేడు. రాజ్ కి నీ కంటే ఎక్కువ కష్టాలున్నాయి. కానీ తన ఉచ్చ్వాస నిశ్వాసల్లో ఫుట్ బాల్ ఉంది. ఇంటర్నేషనల్ ప్లేయర్ కావాలనే తపన ఉంది. నీ అంత టాలెంట్ లేకపోయినా, కృషి,క్రమ శిక్షణ, దీక్ష ఉన్నాయి. అందుకే చూడు… ఈ రోజు నేషనల్స్ కి సెలెక్ట్ అయ్యాడు..’ అంటూ శ్వేత బాధపడింది.

  చూడు శ్వేతా…! నా లాంటి ప్లేయర్ కి ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ సరైన వేదిక. ఇలాంటి చిన్న చిన్న టోర్నమెంట్ ఆడితే లాభం లేదు. టైం వేస్ట్ …’ అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు క్రిష్.

    క్రిష్ ఎప్పటిలాగే కబుర్లతో, తన కష్టాలతో, వంకలతో చేయవల్సినంత ప్రాక్టీస్ చేయకుండా, తనని ఎవరో పెద్ద ఇంటర్నేషనల్ క్లబ్ వాళ్ళు వాళ్ళంతట వాళ్ళే గుర్తిస్తారని ఎదురు చూస్తూ, కబుర్లతో కాలక్షేపం చేస్తూ అక్కడే ఉండిపోయాడు. అన్ని ఫుట్ బాల్ క్లబ్స్ కి దూరం అయిపోయాడు. రాజ్ మాత్రం చిన్న పెద్ద తేడా లేకుండా, వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్నాడు. ఎక్కడా ఏ టోర్నమెంట్ ఉన్న అక్కడ రాజ్ ఉండేవాడు. తన కృ షి, కఠోర పరిశ్రమ, సమయపాలన, ప్రతీ టోర్నమెంట్ లో తన ఉపస్థితి రాజ్ కి మంచి గుర్తింపు తెచ్చింది. ఇండియా లో ఫుట్ బాల్ అంటే రాజ్ పేరు వినబడసాగింది.

కొన్ని నెలల తరువాత రాజ్ ని చాల టోర్నమెంట్స్ లో చూస్తున్న ఒక కోచ్ ఇంటర్నేషనల్ సెలెక్షన్స్ కి ఆహ్వానించాడు. ఈ విషయం శ్వేత ద్వారా తెలుసుకున్న క్రిష్ రాజ్ ఇంటికి వెళ్లి తనని ఇంటర్నేషనల్ సెలెక్షన్స్ కోసం రికమెండ్ చెయ్యమని అడిగాడు. ‘అలాగే చేస్తానన్నాడు’ రాజ్.

కానీ, క్రిష్ ని రికమెండ్ చేస్తే తనకి ఎసరు అని,రికమెండ్  చేశాను కానీ కోచ్ ఒప్పుకోలేదని క్రిష్ కి అబద్ధం చెప్పాడు. ఈ విధంగా ప్రతిభ లో కొంచెం తక్కువ అయినా,స్వీయ క్రమశిక్షణ, సమయపాలన,స్వయంకృషితో రాజ్ విజేతగా నిలిచాడు. అత్యంత ప్రతిభ క్రిష్ కి ఉండి కూడా కేవలం సమయపాలన,ఏకాగ్రత,క్రమశిక్షణ లేక, వేరే  దృష్టి మళ్లి విజేత రావాల్సిన క్రిష్ ఓటమి పాలయ్యాడు.

మన ప్రతి కదలిక ప్రతి కార్యాచరణ మన చుట్టూ ఉన్న వాళ్ళ మీద, మన వాళ్ళ మీద కూడా ప్రభావం చూపుతుంది. క్రిష్ ని ఎంతగానో ఇష్టపడిన శ్వేత, క్రిష్ నిలకడలేని తనంతో విసిగిపోయి తానూ కూడా దూరమయ్యింది.

‘ రాజ్ మాత్రం యుద్ధంలో ….సైనికుడు గెలిచినా, మరో  యుద్ధానికి సిద్ధంగా ఉండే   వీరుడిలా ముందుకు సాగుతూనే ఎన్నో విజయాలు చేజిక్కుంచుకున్నాడు. క్రిష్ మాత్రం రాజ్ విజయాన్ని జీర్ణించుకోలేక ఒక మామూలు జీవనం గడపసాగారు.

నీతి |Moral :” శ్రమ , క్రమశిక్షణ , ఏకాగ్రత ఇవే విజయానికి మెట్లు. ఇవి లేని ప్రతిభావంతుడికి అపజయమే పుట్టినిల్లు…”

‘ ఈ కథ “మాకు మేమే” అనే పుస్తకం నుండి గ్రహించబడినది’.

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *