మా శీను గాడి ప్రేమకథ | Seenu’s Love Story

మా శీను గాడి ప్రేమకథ | Seenu’s Love Story
మా శీను గాడి ప్రేమకథ | Seenu’s Love Story

గణ గణమంటూ ఫోన్ రింగవుతోంది . ఎదో పరధ్యానంగా ఆలోచిస్తూ కూర్చున్న నేను ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చి ఫోన్ అందుకున్నాను. ఆ  శీను…! వాడి గింతులో కాస్త చిరాకు ….

              ‘బాబాయ్…!

      ‘ చెప్పరా  శీను …! ఏంటి సంగతి..?’ వాడి గొంతులోని అసహనాన్ని నేను వెంటనే పసిగట్టాను.

        మీకు తెలియందేముంది బాబాయ్.. ఎప్పటిలా చిన్న గొడవ..!’ అన్నాడు.

        ‘సర్లే.. .! అవన్నీ ఎప్పుడు ఉండేవే కానీ, ఏమంటోందిరా స్వాతి..? నీ కూతురెలా ఉంది..?’ అన్నాను నేను.

       ‘ బాగానే ఉంది బాబాయ్…! గొడవంతా కూతురికి పేరు పెట్టడం గురించే… ‘సత్య’ అని పెడదామని నేను, కాదు కాదు ‘సిద్ధి ‘ అని పెడదామని తను. ఇద్దరం ఓ నిర్ణయానికి రాలేకపోతున్నాం..’

‘దానికి గొడవెందుకు..? మీరిద్దరూ అనుకున్న పేర్లను కలిపి ‘ సత్యసిద్ధి’ అని పెట్టండి.  ఓ పనైపోతుంది..’ అని తేలిగ్గా చెప్పేసాను.

ఏమనుకున్నాడో ఏమో కానీ, ‘సరే.. బాబాయ్..’ అంటూ ఫోన్ పెట్టేసాడు.

శీను మా పెద్దన్నయ్య కుమారుడు. చూడటానికి అందగాడే. అటో ఇటో కష్టపడి డిగ్రీ పూర్తి చేసాడు. శీనుతో ఫోన్ లో మాట్లాడిన తర్వాత ఎందుకో ఏమో వాడి గతం సినిమా రీలులా నా కళ్ళ ముందు మెదలసాగింది.

                                                                             + + + +

మధ్య   తరగతి కుటుంబాల్లో మమతానుబంధాలు కూడా చిత్రంగా ఉంటాయి. రోజు గొడవ పడుతున్నట్టే ఉంటుంది,  మళ్ళీ హారంలో పూలలాగా పొందికగా ఉంటాయి. శీను వాడి తండ్రి మాటను ఏనాడు సీరియస్ గా తీసుకోలేదు. వాడి తండ్రి మాటకంటె, నా మాటలంటేనే వాడికి గురి ఎక్కువ.

                 డిగ్రీ తర్వాత శీను, పై చదువులు చదవాలన్నది మా అన్నయ్య కోరిక. కానీ శీనుకు పై చదువుల మీద అంతగా ఇష్టం లేదు. చదువనేది తన ఒంటికి సరిపడదని  శీను అభిప్రాయం. తన కొడుకు ఉన్నత చదువులు చదివి జీవితంలో బాగా ఎదగాలని మా అన్నయ్య ఆకాంక్ష. ఈ విషయంపైనే ఎన్నో సార్లు తండ్రీ కొడుకులు గొడవ పడ్డ సంగతి నాకు తెలుసు. ఆ రకంగా మూడేండ్లు గడిచిపోయాయి.

ఈ మూడు సంవత్సరాలలో శీను చేయని వ్యాపారం అంటూ లేదు. వాడికి ఉద్యోగం కంటే వ్యాపారమంటేనే ఎక్కువ మక్కువ అని ఈ మూడేండ్లలో నేను అర్థం చేసుకున్నాను. ఉద్యోగం కంటే వ్యాపారంలోనే ఎదగే అవకాశాలున్నాయన్నది నిజమే అయినప్పటికీ వ్యాపారంలో స్థిరత్వం ఉండాలి. ఒకసారి నష్టం వచ్చినా  కుదురుగా దాన్ని లాభాల బాట పట్టించే నేర్పుండాలి. అందుకు మానసికంగా స్థిరంగా ఉండాలి. మా  శీనులో ఆ స్థిరత్వం, నిలకడ మాత్రం తక్కువనే చెప్పాలి.

     చివరాఖరికి ఒకసారి..

     ‘శీను..! ఇవన్నీ నీతో  అయేట్లు లేవు, నీ పర్సనాలిటీ బాగుంటుంది కదా.. పోలీస్ డిపార్టుమెంటులో చేరేందుకు ఎందుకు  ట్రై చేయకూడదు..?’ అన్నాను. దానికి వాడు..

                 ‘లేదు బాబాయ్..! అది నాకు పడదు.. నా ఫ్రెండ్ తండ్రిని చూస్తున్నానుగా.. ఎప్పుడూ  క్రిమినల్స్, కోర్టులు, బందోబస్తులు, తప్ప జీవితంలో ఏమి ఉన్నట్టు కన్పించదు. కుటుంబానికి టైం ఇవ్వరు. చిన్న చిన్న అంనందాలకు కూడా నోచుకోరు. అలాంటి పోలీస్ ఉద్యోగం నేను చేయలేను బాబాయ్..’ అంటూ సూటిగా చెప్పాడు.

‘ అయితే ఏదో ఒక వ్యాపారంలో స్థిరపడిపో..! ఎన్నాళ్లిలా బలాదూర్ గా తిరుగుతావు..’ అంటూ మందలింపుతో కూడిన ఒక ఉచిత సలహా పడేసాను.

నా సలహా విననైతే విన్నాడు కానీ వాడి ఆలోచనలు నాకు తెలుసు. వ్యాపారం చేస్తే మొదట్లో వచ్చే కష్టాల గురించే  వాడు తడబడుతున్నాడు కానీ, ఆ తర్వాత వచ్చే లాభాల గురించే  వాడు ఆలోచించడం లేదని కూడా నాకు తెలుసు. అలా అలా మరో సంవత్సరం గడిచిపోయింది. శీనుగాడి పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా ఉంది. మా అన్నయ్యలో చిరాకు ఎక్కువై పోతోంది. దాంతో అప్పుడప్పుడు తండ్రీ కొడుకుల మధ్య కొంత ఘర్షణ ప్రారంభమైంది .

       ‘ డిగ్రీ పూర్తయి నాలుగు సంవత్సరాలైంది. ఇంతవరకు ఓ ఉద్యోగం లేదు. సద్యోగం లేదు.   రేపు వీడికి పిల్లనెవరిస్తారు.. వీడి పెళ్లి ఎలా అవుతుందని..’ మా అన్నయ్య బెంగపడసాగాడు. మా వదినకేమో కన్న కొడుకంటే అందరు తల్లుల్లాగే విపరీతమైన ప్రేమ. అందుకే కొడుకును ఏమి అనలేకపోతోంది. ఇటు భర్త పడుతున్న ఆవేదన కూడా ఆమెను కలవరపరుస్తోంది.

     ఓ నాడు సహనం నశించిన మా అన్నయ్య కొడుకుతో..

‘ఒరే.. అడ్డగాడిదలా తయారయ్యావు. ఊరంతా బలాదూర్ గా తిరుగుతున్నావు. ఇంత దాకా నిన్ను దార్లో పెట్టాలని తలంతా బాదుకున్నాను. ఇక  నాకు  ఓపిక నశించి పోయింది . చిన్న పిల్లాడివేం కాదు. ఏదో ఒకటి చేయమని అనీ అనీ విసుగొస్తోంది. ఇక నీ ఇష్టం ఏమైనా చేసుకో.. ఈ రోజు నుండి నిన్ను నేను ‘ ఏం చేస్తావ్.. ఎలా బతుకుతావు..?’  అని మాత్రం అడగను. నీ ఇష్టమున్నది చేసుకో.. అంతే ..’ అంటూ  నిష్కర్షగా చెప్పే సాడు. ఆ తర్వాత మా అన్నయ్య శీనును ‘ ఏం చేసి బతుకుతావురా..?’ అని అడగడం నేను విన్లేదు.

                                                                                 + + + +

అనుకోకుండా ఒకనాడు మా అన్నయ్య  మా అపార్టుమెంట్ కు వచ్చాడు. చాలా టెన్షన్ లో ఉన్నట్టు అనిపించింది. గ్లాసెడు మంచి నీళ్లు గడగడా తాగేసి విషయానికి వచ్చాడు. అన్నయ్య బాధంతా శీను గురించే..! 30 సంవత్సరాల కొడుకు ఏ చిన్నపాటి పని కూడా చేయకుండా, ఆవారాగా తన కళ్ళముందే తిరుగుతూ ఉంటె ఏ తండ్రి గుండెలు మాత్రం బాధతో బరువెక్కకుండా ఉంటాయి..?

ఎలాగోలా ఓర్చుకుందామంటే, కుటుంబ సభ్యులకంటే ఎక్కువగా ఇరుగు పొరుగువారి మాటల తూటాలు మరింత బాధిస్తుంటాయి. ‘ ఏమయ్యా.. ! నీ కొడుకు ఏంచేస్తున్నాడు..? పెళ్లి గిల్లీ ఏమైనా చేస్తావా.. లేదా..?’ అంటూ వ్యంగంగా మాట్లాడే వారి సంఖ్య తక్కువేం లేదు. శీనుగాడేమో మాట వినకుండా ఉన్నాడు. ఆ తండ్రికి అంతకంటే ఆందోళన కలిగించే విషయం మరేముంటుంది..?గంట సేపు మా అన్నయ్య తన మనసులో ఉన్న ఆవేదనంతా నా ముందు వొలకబోసుకున్నాడు. కాస్త తేకపడ్డాడో ఏమో, పోతూ పోతూ..

  ‘ఒరే చిన్నా..! శీనుగాడికి నా మాటంటే గౌరవం లేకుండా పోతుంది. వాడ్ని ఒక నెల రోజులు నీ ఇంట్లో పెట్టేసుకో. జీవితం గురించి, సమాజం గురించి వాడికి కొంచెం మోటివేట్ చెయ్. నీ మాటంటే వాడికి గురి ఎక్కువ. నీ మాట కాదనకుండా వాడు జీవితంలో స్థిరపడితే నా అంత అదృష్టవంతుడు ఎవరు ఉండరు. ఈ సహాయం చేసి పెట్టారా..’ అన్నాడు. ఆయన గొంతులోని ఆర్ధ్రతకు నేను కరిగిపోయాను.

    ‘అదేంటన్నయ్యా..! అలా అంటావు..? వాడు బాగుపడితే నీతో పాటు మా అందరికి సంతోషమే కదా..!’ అన్నాను. నా మాటలు ఆయనకు ఎక్కడో సంతృప్తిని కలిగించునట్లున్నాయి. వెళ్లేప్పుడు ఆయన మొహంపైన కొంత వెలుగొచ్చింది.

            ఇది జరిగిన మూడు నెలలకి  శీను మా ఇంటికి వచ్చే అవసరం  ఏర్పడింది.

    మా కారు డ్రైవర్ తల్లి చనిపోవడంతో సడన్ గా వాడు వాడి సొంత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ వెళ్ళిపోయాడు. అలా అర్దాంతరంగా డ్రైవర్ వెళ్ళిపోవంతో నాకు చేయి విరిగినంత పనైంది. ఈ ముంబై మహానగరంలో, విపరీతమైన ట్రాఫిక్ లో సొంతకారు డ్రైవ్ చేస్కోవడం నాకు సుతారం ఇష్టం లేదు. పైగా నా కళ్ళలో కాటరాక్టు కూడానూ..! వెంటనే శీనుకు ఫోన్ చేసి విషయం చెప్పాను. దానికి వాడు..

        ‘ వేరొకరెందుకు బాబాయ్..! నేను ఎలాగూ ఖాళీగానే ఉన్నాను కదా..! నా డ్రైవింగ్ గురించి నీకు తెలుసు. ఒక నెల రోజులు చూస్తుండగానే గడిచిపోతాయి.. నేనే వస్తాను..’ అన్నాడు వాడు. ఏ మాటకు ఆ మాటే చెప్పుకుంటే, నిజానికి మా శీనుగాడి డ్రైవింగ్ సూపర్ గా ఉంటుంది.

  రోజు కారులో కలిసి రాకపోకలు సాగించడం వళ్ళ శీనుగాడు నాకు మరింత దగ్గరయ్యాడు. ఓనాడు మాటలో మాటగా..

      ‘ ఒరే శీను..! నీ డ్రైవింగ్ చాలా బాగుంటుంది కదా..! నువ్ వేరే ఏదో వ్యాపకం కోసం ఎదురుచూడకుండా ఈ డ్రైవింగ్ వృత్తిలోనే ఎందుకు ఉండిపోకూడదూ..! ఆహా..! ఊరికే అన్నాను.. కాస్త ఆలోచించి చూడు..’ అన్నాను యథాపళంగా .. ఇదే విషయాన్ని నేను వాడికి ఆర్డర్ వేసి చెప్పొచ్చు. కానీ వాడి అహం దెబ్బతినకుండా జాగ్రత్త పడ్డాను. లేకుంటే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది.

       ఆ సమయంలో వాడు సైలెన్స్ గానే ఉండిపోయాడు.

       కానీ, ఆ తర్వాత పనులు చకచకా జరిగిపోయాయి.

మూడు నెలల్లో వాడు ట్యాక్సీ డ్రైవర్ అవతారం ఎత్తాడు. మొదట్లో మా అన్నయ్య దీనికి ఒప్పుకోలేదు. డిగ్రీ చదివిన కొడుకు ట్యాక్సీ డ్రైవర్ కావడం తండ్రికి ఇష్టం లేకపోయింది. ‘డిగ్నిటీ ఆఫ్ లేబర్’ గురించి నేను మా అన్నయ్యకు సున్నితంగా అర్థమయ్యేలా చెప్పాను. ఆయన పూర్తిగా సంతృప్తి చెందక పోయినప్పటికీ అభ్యంతరం పెట్టలేదు.

      మా శీనులో ఒక మంచి మనిషి దాగి ఉన్నాడు. వాడుండే  ఇంటి ప్రాంతంలో వాడికి పరోపకారిగా పేరుంది. ఎవరికి ఏ ఆపద వచ్చిన, అర్ధరాత్రి, అపరాత్రి అని చూడకుండా ఆదుకుంటాడు. దీంతో వాడి స్నేహబృందం కూడా బాగా పెరిగింది. ట్యాక్సీ డ్రైవర్ గా కంటిన్యూ అవుతూనే, ఒకనాడు ఏదో ఆలోచనతో తన ట్యాక్సీ ని చిలుకూరు ప్రాంతంలో ఉన్న బాలాజీ మందిరం నుండి మెహదీపట్నం స్టేషన్ వరకు ‘ షేర్ ఏ ట్యాక్సీ ‘ గా పరిమితం చేసాడు. అప్పటికే మా శీను ట్యాక్సీ డ్రైవర్ నుండి ట్యాక్సీ యజమానిగా ప్రమోషన్ పొందాడు.

     అంతేగాక,

ఫెస్టివల్ నాడు భక్తుల కోసం ఉచితంగా ట్యాక్సీ తోలేవాడు. దీంతో  వాడికి  మంచి పేరొచ్చింది. వాటి ట్యాక్సీ వెనక అద్దంపై ‘ భైరవనాథ్ చాంగ్ భలా … అమ్మ దీవెన మరియు హ్యాండీక్యాప్డ్ వాళ్లకి ఉచితం రాసి ఉంటుంది. శీనుగాడు ట్యాక్సీ డ్రైవర్ గా మారడానికి సిగ్గు పడకుండా విజయం సాధించడాన్ని చూసిన  ఓ  అమ్మాయి ‘ స్వాతి ‘ మా వాడిపై మనసు పారేసుకుంది.

      ప్రేమ కథలు, గోలలు అన్నీ ఒకేలా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మా శీనుగాడు ప్రేమ కథలో కూడా కుటుంబ సభ్యుల అభ్యంతరం, గొడవలు, అల్లర్లు, బెదిరింపులు, పోలీస్ కేసులు , పంచాయితీలు  అన్నీ జరిగాయి. కానీ జీవితాన్ని జయించినట్లుగానే మా శీనుగాడి ప్రేమకథ కూడా విజయంతమైంది. దాంట్లో కూడా నా ప్రమేయం ఉందనుకోండి…!

         ఆ జంట తమ  కూతురికి పెట్టాల్సిన పేరు కూడా ఓ సమస్యగా మారి మళ్ళీ నా ముందుకొచ్చిందన్నమాట.

     నా సలహా నచ్చిందో ఏమో వాళ్లిద్దరూ తమ కూతురికి నేను చెప్పినట్లే ‘సత్యసిద్ధి’ అని పేరు పెట్టుకున్నారు.

    గొడవ ఖతం …!

‘ బాబాయ్..  నువ్ సూపర్ ..!’ అంటూ మా శీనుగాడు మళ్ళీ ఫోన్ చేసినపుడు నాలో నేనే నవ్వుకున్నాను తృప్తిగా.. !!

నీతి | Moral : ప్రతి ఒక్కరి జీవితంలో కష్ట సుఖాలు అనేవి సాధారణం, కొంచెం ఓపికతో ఉంటె మంచి రోజులు కూడా సాధారణం. మనం ఏ పని చేస్తున్నామనేది ముఖ్యం కాదు, మనం చేసే పనితో ఫామిలీని బాగా చుసుకుంటున్నామా..? లేదా..? అనేది ముఖ్యం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *