చాలా కాలం క్రితం, ఒక చిన్న గ్రామంలో ఒక బ్రాహ్మణుడు నివసించేవాడు. అతని పేరు మిత్రా శర్మ. ఒకసారి అతని తండ్రి కొన్ని పురాతన హిందూ ఆచారాలను చదివి అందులో ఉన్న సమాచారం ప్రకారం దేవతకి మేకను బలి ఇవ్వమని చెప్పాడు. సమీప గ్రామంలోని దుకాణాలని సందర్శించి ఆరోగ్యంగా ఉన్న ఒక మంచి మేకను తీసుకురమ్మని కొడుకుకి చెప్పాడు.
పశువుల మేళాన్ని బ్రాహ్మణుడు సందర్శించి ఆరోగ్యకరమైన మరియు బాగా బలిష్టంగా ఉన్న మేకను కొన్నాడు. అతను మేకను భుజం మీద వేసుకుని తిరిగి తన ఇంటికి వెళ్లాడు.అక్కడే ఉండి ఇదంతా గమనిస్తున్న ముగ్గరు దుండగులు బ్రాహ్మణుడి దగ్గర ఉన్న మేకను ఎలాగైన స్వంతం చేసుకోవాలి అనుకున్నారు.
అందులో ఒకడు ఈ మేకను చూస్తుంటే మన ముగ్గురి కుటుంబాలు రెండు రోజులు కడుపునిండా మాంసపు భోజనం చేయొచ్చు అని, ఇంకొకరు ఇంత బలిష్టమైన మేకను చూడటం నేను ఇదే మొదటిసారి ఈ మేకను ఎలాగైనా మనం చేజిక్కుంచుకోవాలి అని అన్నాడు. మూడవవాడు మనం ముగ్గురం ఒకేసారి కాకుండా విడివిడిగా వెళ్లి మన ప్రణాళికను అమలు చేద్దాం అని అన్నాడు. ముగ్గురు వేరువేరుగా విడిపోయి, బ్రాహ్మణున్ని వెంబడించారు.
మార్గ మధ్యలో సమయాన్ని చూసి మొదటి దుండగుడు బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్లి,ఆశ్చర్యకరమైన స్వరంలో బ్రాహ్మణుడితో, “అయ్యా..!, ఇది ఏమిటి? మీలాంటి ధర్మవంతుడు ఎందుకు మోస్తున్నారు ఒక కుక్కని అని అన్నాడు..? ఆ మాటలు విని బ్రాహ్మణుడు షాక్ అయ్యాడు. “మీరు సరిగ్గా చూడండి ఇది కుక్క కాదు మేక అని బ్రాహ్మణుడు బదులిచ్చాడు.నేను చూసినదాన్ని నేను మీకు చెప్పాను. మీరు నమ్మకపోతే నన్ను క్షమించండి” అని దుండగుడు చెప్పి వెళ్లిపోయాడు.
కాస్త దూరం వెళ్ళాక ఇంకో దుండగుడు బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్లి “అయ్యా…!, చనిపోయిన దూడను మీ భుజాలపై ఎందుకు తీసుకువెళుతున్నారు ? మీరు తెలివైన వ్యక్తి అనిపిస్తుంది. ఇలాంటి చర్య మీలాంటి వ్యక్తికి ఇది సరికాదు అని చెప్పి వెళ్ళిపోయాడు. “ఏమిటి!” బ్రాహ్మణుడు అరుస్తూ . “బ్రతికిన మేక చనిపోయిన దూడ లాగ ఎలా కన్పిస్తుంది ?” రెండవ దుండగుడు నవ్వుతూ వెళ్ళిపోయాడు.
అంతలోనే మూడవ దుండగుడు వచ్చి అయ్యా మీరు నిజంగానే చనిపోయిన దూడను తీసుకెళ్తున్నారు అని అన్నాడు. ఈ మాటలు విన్న బ్రాహ్మణుడు తీవ్ర ఆందోళన చెందాడు. ‘ఇది నిజంగా మేక కాదా!’ అతను ఆలోచించడం ప్రారంభించాడు. “ఇది ఒక రకమైన దెయ్యమా..!? నాకు మేకలాగా కనబడుతుంది కానీ అందరికి వేరేరకంగా కనబడుతుంది
అనుకుని, అప్పుడు బ్రాహ్మణుడు భయపడ్డాడు. అతను మేకను రోడ్డు పక్కన పారేసి పారిపోయాడు.
దుండగులు మేకను పట్టుకుని సంతోషంగా విందు చేసుకున్నారు.