తెలివైన రాజు | The Clever King
తెలివైన రాజు | The Clever King

చాలా కాలం క్రితం ఒక దేశం ఉండేది.  అక్కడ ప్రజలు ప్రతి సంవత్సరం రాజుగా ఒకరిని  ఎన్నుకుంటారు.. రాజుగా ఒక సంవత్సర పదవి కాలం ముగిసాక  ఆ రాజు ఒక  ఒక ద్వీపానికి వెళ్లవలసి ఉంటుంది. రాజుగా  ప్రతిజ్ఞ చేసేముందు ఈ ఒప్పందానికి  ఒప్పుకోవాలి.  అలా అయితేనే రాజుగా ఉండడానికి అర్హుడు.

రాజుగా ఉన్నపుడు ఎంత ఖరీదైన వసతులు అనుభవించినా…  రాజుగా కాలం ముగిశాక ఒంటరిగా మరియు ఎలాంటి వసతులు లేకుండా ద్వీపానికి వెళ్లడం మరియు  అక్కడే మిగతా జీవనాన్ని గడపడం అనేది ఆ రాజుకి చాలా పెద్ద శిక్ష. ఇది ఆ దేశ ప్రజలకి ఆనవాయితీగా వస్తున్న ఆచారం. ఈ  ఆచారాన్ని మార్చేవారు ఎవరూ  లేకపోవడం వలన దీనిని ఇంకా పాటిస్తున్నారు. ఇందుకారణంగా .. ఆ దేశానికి రాజు అవడానికి ఎవరు కూడా ముందుకు రారు.

ప్రతి సంవత్సరం ఎదో వంకతో తప్పు చేసి దొరికిన వారిని రాజుగా నిలబెట్టి సంవత్సరం ముగిశాక ద్వీపంలో వదిలి రావడం జరిగేది. ఇది వారికి మాములుగా మారింది.

ఒక రాజు తన పదవీకాలం ముగించాడు మరియు అతను ద్వీపానికి వెళ్లి అక్కడ నివసించే సమయం వచ్చింది. ప్రజలు ఆ రాజుకి  ఖరీదైన దుస్తులు మరియు ఆభరణాలతో అలంకరించి , ఏనుగుపై ఊరేగించి , ప్రజలందరికీ వీడ్కోలు చెప్పడానికి నగరాల వీదుల్లోకి  తీసుకెళ్లారు. ఒక సంవత్సరం పాటు పరిపాలించిన రాజులందరికీ ఇది విచారకరమైన క్షణం. వీడ్కోలు చెప్పిన తరువాత, ప్రజలు రాజును పడవతో మారుమూల ద్వీపానికి తీసుకువెళ్లి  అక్కడే వదిలేశారు.

రాజుని వదిలి తిరిగి తమ దేశానికి  వస్తున్నపుడు, వారు అప్పుడే మునిగిపోయిన ఒక   ఓడను చూసారు..  దాదాపు ఓడలో ఉన్న అందరు  చనిపోయారు. కానీ,  నీటిపైనా తేలుతున్న ఒక  చెక్క ముక్కను పట్టుకొని ప్రాణాలతో బయటపడిన ఒక యువకుడిని వారు చూశారు. వారికి  ఇప్పుడు కొత్త రాజు అవసరం కావడంతో, వారు ఆ యువకుడిని కాపాడి  తమ దేశానికి తీసుకెళ్లారు.

వారు అతనిని ఒక సంవత్సరం రాజుగా ఉండమని అభ్యర్థించారు. మొదట అతను నిరాకరించాడు. కాని, తరువాత అతను రాజుగా ఉండటానికి అంగీకరించాడు. ప్రజలు అన్ని నియమ నిబంధనల గురించి మరియు ఒక సంవత్సరం తరువాత అతన్ని  ద్వీపానికి పంపించడం గురించి అన్ని చెప్పి రాజుగా ప్రతిజ్ఞ చేయించారు. .

రాజుగా మూడు రోజులు గడిచిన తరువాత, మిగతా రాజులందరినీ పంపిన ద్వీపాన్ని నాకు  చూపించగలరా…?! అని ఆయన మంత్రులను అడిగారు. వారు అంగీకరించి అతన్ని ద్వీపానికి తీసుకెళ్లారు. ఆ  ద్వీపం దట్టమైన అడవులతో  కప్పబడి ఉంది మరియు క్రూరమైన జంతువులకు ఆవాసం.. రాజు ద్వీపాన్ని తనిఖీ చేయడానికి కొంచెం లోపలికి వెళ్లాడు. కొద్ది దూరంలోనే  అతను గత రాజుల యొక్క మృతదేహాలను చూసాడు.. వారిని ద్వీపంలో వదిలివేసిన వెంటనే జంతువులు వచ్చి వారిని చంపేసాయని అతనికి అర్థమైంది.

అందుకే ఈ దేశానికీ రాజు అవడానికి ఎవరు ముందుకు రాకపోవడంతో…  అసలు ఈ దేశానికి చెందని  నన్ను రాజుగా నియమించారు అని మనసులో అనుకున్నాడు.

రాజు తిరిగి దేశానికి వెళ్లి 100 మంది బలమైన కార్మికులనుమరియు క్రూరమైన జంతువులను వేటాడే వేటగాళ్లను  ఉద్యోగంలో నియమించాడు.. అతను వారిని ద్వీపానికి తీసుకెళ్ళి, అడవిని శుభ్రం చేయాలని, ప్రాణాంతక జంతువులన్నింటినీ చంపేయమని, అదనపు చెట్లన్నీ నరికివేయమని ఆదేశించాడు. ఆ ద్వీపాన్ని మొత్తం శుభ్రం చేయడానికి తప్పకుండ సంవత్సరం వరకు అవుతుందని కూలీలు చెప్పారు.

పనులు ఎలా పురోగమిస్తున్నాయో చూడటానికి అతను ప్రతి నెలా ద్వీపాన్ని సందర్శించేవాడు. మొదటి నెలలో, జంతువులన్నీ తొలగించబడ్డాయి మరియు అనేక చెట్లను నరికివేశారు. రెండవ నెలలో, ద్వీపం మొత్తం శుభ్రం చేయబడింది. అప్పుడు రాజు కార్మికులకు ద్వీపంలోని వివిధ ప్రాంతాలలో తోటలు నాటమని చెప్పాడు. అతను కోళ్లు, బాతులు, పక్షులు, మేకలు, ఆవులు వంటి ఉపయోగకరమైన జంతువులను కూడా తీసుకుని ద్వీపంలో పెంచడం మొదలు పెట్టాడు.. మూడవ నెలలో, ఆ రాజు  పెద్ద ఇళ్ళు మరియు ఈ దేశానికి మరియు ఆ ద్వీపానికి మధ్య రాకపోకలు సులువుగా ఉండడానికి అన్ని సదుపాయాలు కలిపించాడు.  కొన్ని నెలల్లోనే , ఆ  ద్వీపం ఒక అందమైన ప్రదేశంగా మారింది.

రాజుగా ఉన్న వారికి ప్రతి నెల కొంత డబ్బుని వేతనంగా ఇస్తారు. అందులో చాలా  తక్కువ మొత్తాన్ని ఖర్చు చేసి మిగతా డబ్బుని జమ  చేసి ఆ  డబ్బుతో మిగతా జీవితాన్ని ద్వీపంలో ఆనందంగా గడపాలని అతని ఆలోచన. రాజు  సాధారణ బట్టలు ధరించేవాడు మరియు రాజుగా సంపాదించిన సంపాదన నుండి చాలా తక్కువ ఖర్చు చేసేవాడు. అతను సంపాదించిన మొత్తాన్ని చాలా పెద్ద మొత్తంలో జమ చేసుకున్నాడు. . ఇలా తొమ్మిది నెలలు గడిచాయి. ద్వీపం ఈ దేశానికంటే చాలా అందంగా రూపు  దిద్దుకుంది. అక్కడ ఇపుడు ఎలాంటి క్రూర  జంతువులు లేవు. ఒక్కరైనా ఆనందంగా గడిపేలా ఉంది.

రాజు మంత్రులను పిలిచి వారితో ఇలా అన్నాడు: “నేను ఒక సంవత్సరం తరువాత ద్వీపానికి వెళ్ళవలసి ఉందని నాకు తెలుసు.  కాని,

నేను ఇప్పుడే అక్కడికి వెళ్లాలనుకుంటున్నాను.” అని చెప్పాడు రాజు  కానీ మంత్రులు దీనికి అంగీకరించలేదు మరియు సంవత్సరాన్ని పూర్తి చేయడానికి మరో 3 నెలలు వేచి ఉండాల్సి ఉందని చెప్పారు

3 నెలలు గడిచాయి రాజు యొక్క సంవత్సర కాలం ముగిసింది..యధావిధిగా  ప్రజలు  రాజును ఖరీదైన దుస్తులు మరియు ఆభరణాలతో అలంకరించి ప్రజల నుండి వీడ్కోలు తీసుకోవడం కోసం ఏనుగుపై ఊరేగింపుకి తీసుకెళ్లారు. అతడు అన్ని పనులు ఎంతో సంతోషంగా పూర్తి చేస్తున్నాడు, ద్వీపానికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడు. 

 ప్రజలు అతనిని అడిగారు, “మిగతా రాజులందరూ ఈ సమయంలో ఏడుస్తూ వెళ్లారు.  కానీ, మీరు నవ్వుతున్నారు  ఎందుకు ?”

అప్పుడు అతను, మిగతా రాజులందరూ భవిష్యత్తు గురించి ఆలోచించకుండా వర్తమానంలో ఎలా ఉన్నామో ఎంత సకల సౌభాగ్యాలు అనుభవించాలి అని ఆలోచించారు. వారికి తెలుసు ఈ సౌకర్యాలన్నీ ఒక సంవత్సరం పాటే అని తర్వాత ఎలాగూ మరణమే కదా…  . అందుకే ఇంకేమి ఆలోచించకుండా ఉన్న ఒక్క సంవత్సరం రాజుగా విలాసవంతమైన జీవనం   గడిపారు. నా   దృష్టిలో వారు తెలివైన రాజులూ కారు.

నేను మాత్రం నాకు దొరికిన  ఈ రాజు  పదవిని భవిష్యత్  కాలంలో కూడా ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఆలోచించాను. అందుకె నేను తర్వాత ఉండబోయే ప్రదేశమైన ద్వీపాన్ని  మొత్తం అందమైన ప్రదేశంగా మార్చాను. ఇపుడు నేను వెళ్ళేది ఆ అందమైన ప్రదేశానికే .. అందుకే నాకు ఎలాంటి బాధ లేదు.  ఇంకా ఆ అద్భుత ద్వీపానాకి వెళ్లడానికి  ఎప్పటి నుండో వేచి చూస్తున్నాను అని చెప్పాడు.

నీతి |Moral : ” ముందుచూపు లేకపోవడం అవివేకం. ఇపుడున్న పరిస్థితులలో వర్తమానం గురించి ఆలోచిస్తూ .. , భవిష్యత్తు కోసం ప్రణాళిక వేసుకోవడం మంచిది .  వేసుకున్న ప్రణాళికని  పాటిస్తే  తగిన ఫలితం వస్తుంది.”

9 Comments

  1. తెలివైన రాజు కథ చదివాను,
    బావుంది. ఇలాగే ఇంకా మంచి, మంచి కథలు, వ్రాసి ఎంతో వాసికెక్కాలని నా హృదయపూర్వక ఆశ. ☝️💐💐👌👍

    1. ధన్యవాదములు. ఇలాగే మా కథలు చదువుతూ మమ్మల్ని ప్రోత్సహించాలని మా కోరిక.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *