జుంఖా | The Jhumka
జుంఖా | The Jhumka

సునీత మరియు సుబ్బు భార్యభర్తలు.  వారికి  ఇద్దరు కూతుర్లు. సునీతది  ఉన్నతమైన కుటుంబం.  ఆ ఊరి మొత్తంలో పెద్ద జమీందారులు వాళ్ళు.  25 సంవత్సరాల  ముందు సునీత మరియు సుబ్బు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ కారణంగా సునీత తల్లితండ్రులు మరియు అన్నయ్యలు వారి పెళ్లికి అంగీకరించక ఇంటినుండి వెళ్లగొట్టారు.  సుబ్బుది పేద  కుటుంబం  రోజువారీ వ్యాపారి. ఇపుడిపుడే వ్యాపారంలో స్థిరపడి కొద్దగా మంచిగా బ్రతుకుతున్నారు.

ఇద్దరు కూతుర్లని చదివించుకుంటు ఉన్నంతలో సంతోషంగా ఉన్నారు. ఒకరోజు సునీత నాన్నగారికి గుండెపోటు రావడంతో చివరిచూపుగా సునీతని చూస్తా అని అనడంతో పాత పగలన్నీ పక్కన పెట్టి అన్నయ్యలు సునీతని ఇంటికి పిలిపించారు.

కొద్దిరోజులకే సునీత తండ్రి కాలం చేసారు. ఎలాగూ ఇంటికి వచ్చావు కదా ఇకనుండి భర్త పిల్లలతో పాటు వస్తూ ఉండు అని ఇంట్లో వాళ్లు చెప్పడంతో సునీత చాలా సంతోషపడింది.

25సంవత్సరాల తర్వాత కుటుంబీకులు కలిసే సరికి సునీత పిల్లలతో కలిసి అపుడపుడు వెళ్తూ వస్తూ ఉంది. వారిరువురి మధ్య తిరిగి మంచి బంధం ఏర్పడింది.

సునీత చిన్న కూతురు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది. ఫైనల్ ఇయర్ కావున కాలేజీ వాళ్లు టూర్ ప్లాన్ చేసారు. దాని కోసం 10000 రూపాయలు కట్టాలని చెప్పారు. సునీత చిన్న కూతురి ఫ్రెండ్స్ అందరు కూడా టూర్ కి వెళ్తున్నారు. తనకి కూడా వెళ్లాలని ఉంది అని తల్లికి చెప్పింది. 10000 రూపాయలు మరియు స్వంత ఖర్చులు ఇంకా టూర్ వారం రోజుల పాటు ఉంటుంది కాబట్టి మంచి డ్రెస్స్ లు కొనాలి మొత్తం కలిపి 30000 రూపాయల వరకు ఖర్చు ఉంటుందని చెప్పింది. ఇదంతా విన్న సునీత ఏంచేయాలో అర్ధం కాక, మీ నాన్నకి చెప్తాలే అంది. వారిది పేద కుటుంబం అయ్యేసరికి 30000 రూపాయలు వారికి చాలా  పెద్ద మొత్తం.

ఇదిలా ఉండగా… కొన్నిరోజుల్లోనే   సునీత అన్నయ్య కూతురికి పెళ్లి కుదిరింది. మొదటి పెళ్లి పత్రిక సునీతకి ఇచ్చి పెళ్లికి పెద్దగా ఆహ్వానించాడు.

పెళ్లి పెద్దగా ఆహ్వానించినందుకు మొదట చాలా సంతోషపడిన తర్వాత ఉన్న బాధ్యతలు తలుచుకుని భయపడింది. సునీతకి పడుకున్న నిద్ర పట్టకుండా అయింది. అటు చిన్న కూతురి టూర్ కి కావలసిన ఖర్చులు మరియు అన్నయ్య కూతురి పెళ్లి కోసం పెట్టుపోతలు ఎంత తక్కువ అనుకున్న ఒక తులం బంగారం అయినా పెళ్లి కూతురికి పెట్టాలి అని మనసులో అనుకుంది.

సుబ్బు పని నుండి రాగానే తన మనసులో ఉన్న మాటలు చెప్పింది. దానికి సుబ్బు మంచి మనసుతో ఒప్పుకున్నా అంత డబ్బు సర్దలేను అని బాధతో చెప్పాడు.

మరుసటి రోజు  శ్రావణ్ సోమవారం అయినందున సునీత మరియు చిన్న కూతురు కలిసి గుడికి వెళ్లారు. ఎన్ని పనులు చేస్తున్న సునీత ఆలోచన మొత్తం టూర్ మరియు పెళ్లికి కావలిసిన ఖర్చుల గురించే ఆలోచిస్తుంది. గుడిలో దైవ దర్శనం చేసుకొని పక్కనే ఉన్న ఒక చెట్టు కింద కూర్చోడానికి వెళ్లారు ఇద్దరూ…

సునీతకి చెట్టు కింద ఒక విలువైన వస్తువు దొరికింది అది ఎవరిదో జుంఖా  (కమ్మాల బుట్ట ) చూడటానికి ఎంతో అందంగా మరియు చాలా బరువుగా ఉంది. బాగా డబ్బున్న వాళ్ళనుకుంటా ఒక్క జుంఖానే దాదాపు రెండు తులాల బరువుతో చేయించుకున్నారు. అది చూసి తల్లి కూతుర్లు అనుకున్నారు ‘ మనకంటే ముందు ఇక్కడ ఎవరో కూర్చున్నారు బహుషా వారిదే ఇక్కడ పడిపోయి ఉంటుంది అని’.

సునీత ఆ జుంఖా గురించి  మనసులో… ఇది 3తులాల బరువుతో ఉంది అంటే ఇప్పటి లెక్కన వేసుకుంటే దాదాపు లక్షయాభైవేల రూపాయలు ఇందులో నుండి ఒక తులం చైన్ చేయించి నా అన్న కూతురికి ఇవ్వొచ్చు మరియు నా కూతురు కూడా పెళ్లీడుకొచ్చింది తనకి ఏమైనా చేయించిచ్చు ఇంకా మిగతా డబ్బులతో కూతురిని టూర్ కి కూడా పంపించొచ్చు ఆ దేవుడే మా కష్టాలు తెలిసి ఇలా దారి చుపించాడేమో అని అనుకుంది మనసులో సంతోషంగా..

కాసేపటికి తేరుకొని చూసేసరికి తన కూతురు మరియు జుంఖా కనబడలేదు .. కూతురు,  ఎవరు జుంఖా పాడేసుకున్నారో ఇంత విలువైనది పాపం వాళ్లది వాళ్లకి ఇచ్చేయాలి అని గుడిలో వాళ్లకోసం వెతుకుతుంది. అది చూసిన సునీత వెంటనే కూతురి దగ్గరికి పరిగెత్తి జుంఖా తీసుకోబోయింది. అంతలోనే కూతురు మైక్ లో అనౌన్స్ చేసింది ఎవరో చెట్టు కింద జుంఖా పాడేసుకున్నారు ఇది చాలా విలువైనది.

వెంటనే మీరు వచ్చి ఈ జూకా తీస్కోండి కాకపోతే మీ ఇంకొక జుంఖా చూపించగలరు అని చెప్పింది.

ఆ మాటలు వినగానే , వెంటనే ఒక ఫామిలీ వచ్చి,  జుంఖా మాదేనండి. ఇందాకే పడిపోయింది దానికోసమే చాలా సమయం నుండి వెతుకుతున్నాము. ఇదిగో చూడండి దానికి ప్రూఫ్ మా దగ్గర ఉన్న ఇంకో జుంఖా అని చెప్పారు. ఇవి మాకు తర తరాలుగా వస్తున్న జుంఖాలు, ఇక పోయింది అనుకున్నాము. ఇది లేకుండా ఇంటికి వెళ్లుంటే మా నాయనమ్మ చాలా బాధపడేది.  సమయానికి మీ అనౌన్సుమెంట్  వినిపించి వచ్చాము. చాలా  కృతజ్ఞతలు అని చెప్పారు. ఈ సంఘటన చూస్తున్న గుడిలో ఉన్నవారందరు సునీత కూతురిని చాలా మెచ్చుకున్నారు.

ఇదంతా గమనిస్తున్న సునీత, తన కూతురి యొక్క సమయస్ఫూర్తి  మరియు తెలివిని చూసి సంబరపడిపోయింది. ఇంత వయస్సు వచ్చిన ఒక్కసారి నేను ఎంత మూర్ఖంగా ఆలోచించాను.   కానీ, నా  కూతురు అలా కాదు అని అనుకుంది మనసులో….

జుంఖా తిరిగి ఇచ్చిన కారణంగా వారు సునీత చిన్న కూతురికి 50,000 రూపాయలు బహుమానంగా ఇచ్చారు. ఆ డబ్బులతో సునీత తన అన్న కూతురికి అర తులం ఉంగరం చేయించి మిగతా డబ్బుతో కూతురిని టూర్ కి పంపించింది.

నీతి | Moral : క్లిష్ట పరిస్థితులలో మనమేంటో పరీక్షించబడుతుంది. ఆ పరిస్థితులలో మనకు అనుకూలంగా కాకుండా న్యాయానికి అనుకూలంగా ఉండటం చాలా గొప్ప విషయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *