ఒకప్పుడు సీతారామ రాజ్యం యొక్క రాజు అన్ని రాజ్యాలని సందర్శించాలని నిశ్చయించుకున్నాడు. అలా సందర్శించడం వల్ల ఆ రాజ్యంలో ప్రజలు ఎలా జీవిస్తున్నారు మరియు ఆ రాజ్యం యొక్క రాజులు ప్రజలకి ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నారు అలాంటివి తెలుసుకొని తన రాజ్యంలో కూడా ప్రజలకి ఆ సదుపాయాలు కల్పించాలని అనుకున్నాడు.
అలా అన్ని రాజ్యాలని సందర్శిస్తూ చివరికి తమ పక్క రాజ్యం అయిన భూపతి రాజ్యానికి వెళ్ళాడు. అక్కడ ప్రజలు ఎప్పుడు కూడా ఆ రాజు వల్ల మరియు రాజు కల్పించే సదుపాయాల వల్ల చాలా ఆనందంగా ఉంటారని అందరు అనుకుంటుండేవారు. అది విన్న రాజు అక్కడ రాజ్యంలో తిరుగుతూ ప్రజలు ఎలా జీవనాన్ని గడుపుతున్నారో గమనిస్తున్నాడు.
అలా తిరుగుతూ చివరికి రాజ్యంలోని ఉద్యాన వనంలోకి వచ్చారు ఇరు రాజ్యపు రాజులు. అక్కడ భూపతిరాజ్యపు రాజు తన ఉద్యాన వనంలో చాలా రకాల పక్షులు మరియు జంతువులని పెంచుతున్నాడు. అందులో మకావ్ జాతికి చెందిన చిలకలు ఎంతో అందంగా ఉన్నాయి. అది చూసిన సీతారామ రాజ్యపు రాజు చాలా ఆశ్చర్యపడ్డాడు. మాకావ్ చిలకలు మాట్లాడటం ,అత్యంత ఎత్తుకి ఎగరడం మరియు తన రంగు రంగుల రెక్కలని చూసి చాలా ముచ్చటపడ్డారు. అది చూసిన భూపతి రాజ్యపు రాజు ఆ మకావ్ చిలకలని సీతారామ రాజ్యపు రాజుకి బహుమతిగా ఇచ్చాడు.
వాటిని తన రాజ్యానికి తీసుకొచ్చి, తన రాజా భవనంలో ఉన్న ఉద్యానవనంలో ఉంచడానికి ప్రత్యేకమైన ఏర్పాటు చేయించాడు రాజు . తన గది యొక్క కిటికీ నుండి చూస్తే కనబడేలా ఉంచాడు. వాటితో ప్రతీరోజు కాసేపయినా గడిపేవాడు.
కొన్ని రోజులయ్యాక రెండు చిలకలలో ఒక చిలక ఎగరడం మానేసింది. చిలక గూటి నుండి బయటకి వచ్చి చెట్టు కొమ్మ పైన కూర్చొని ఉండేది. అలా చాలా రోజులు గమనించారు రాజుగారు, చిలకకి ఏమైనా జబ్బు చేసిందేమో అని మంచి వైద్యుడిని పిలిపించాడు. ఎన్ని ప్రయత్నాలు చేసిన ఆ చిలక ఎగరడం లేదు. రాజులో చింత ఎక్కువైంది. సభలో అందరి మంత్రులను సమావేశపరిచి ఎలాగైనా చిలకని ఎగిరేలా చేయాలనీ, అలా చేసిన వారికి తగిన బహుమానం ఇస్తానని చెప్పాడు.
సలహా దారుడైన ఒక మంత్రి లేచి ప్రభు నేనొక ఉపాయం చెప్తాను. దానితో ఫలితం వస్తుందని నా అభిప్రాయం అన్నాడు.
చెట్లు ,చేమలు పక్షులు మరియు జంతువులతో అందరికంటే ఎక్కువ ప్రీతి,మైత్రి కలవాడు వ్యవసాయదారుడు కావున ఒక వ్యవసాయదారుడిని పిలిచి సమస్యని వివరిద్దాము అన్నాడు. ఆ మాట విన్న రాజు కూడా దానికి అంగీకరించాడు.
మరుసటి రోజు ఒక వ్యవసాయదారుడుని పిలిచి సమస్య వివరించి చిలక దగ్గరికి తీసుకెళ్లాడు మంత్రి. కాసేపయ్యాక చిలక ఎగరడం ప్రారంభించింది కిటికీ నుండి అది చూసిన రాజు వెంటనే సంతోషించి వ్యవసాయదారుడుని పిలిచి ఇలా అడిగాడు.
రాజ్యంలో ఉన్న ఎంతో మంది వైద్యులవల్ల కానీ పనిని నీవు చేసావు. అసలు నీకిదెలా సాధ్యం అయింది నువవ్వు ఏంచేసావు? అని అడిగాడు. దానికి బదులుగా ఆ వ్యవసాయదారుడు చేతులు కట్టుకుని, నాకు వైద్యం లాంటిది ఏమి తెలియదు ప్రభు. ఆ చిలక వచ్చి కూర్చుంటున్న చెట్టు కొమ్మ ని నరికేసాను. అంతే చిలక ఎగరడం మొదలెట్టింది అన్నాడు.
అతను చేసిన పనికి ఆశ్చర్యపోయిన రాజు కాసేపటికి తేరుకొని ఆ వ్యక్తి , తెలివితో సమస్యని పరిష్కరించిన విధానానికి చాలా మెచ్చుకుని తగిన బహుమానం ఇచ్చి ఆ చిలకల క్షేమం చూసుకోవడానికి అతనినే పనికి కుదిర్చాడు.