మనందరికీ తెలిసినట్లుగా, బీర్బల్ చక్రవర్తి అక్బర్ కు ఇష్టమైన మంత్రి మాత్రమే కాదు, అతనికి సహజ సిద్ధంగా ఉన్న తెలివి మరియు వివేకం కారణంగా చాలా మంది సామాన్యులకు ప్రియమైన మంత్రి కూడా. వ్యక్తిగత విషయాల్లో సలహాల కోసం దూరప్రాంతాల నుంచి కూడా ఆయన వద్దకు వచ్చేవారు.
అయితే, ఆయనకు పెరుగుతున్న ప్రజాదరణను చూసి అసూయపడి, ఆయనను తీవ్రంగా ఇష్టపడని మంత్రుల బృందం ఉంది. వారు బాహ్యంగా అతనిని ప్రశంసిస్తారు మరియు పొగడ్తలతో ముంచెత్తుతారు. కానీ లోపల, వారు అతనిని చంపడానికి కూడా వెనకాడని దుర్మార్గపు ఆలోచనలు కలిగినవారు.
ఒకరోజు వారు ఒక పథకంతో రాజుగారి యొక్క ప్రత్యేకమైన క్షురకుడి దగ్గరకు వెళ్లారు. ఆ క్షురకుడు, రాజుకు అత్యంత సన్నిహితుడు కాబట్టి, బీర్బల్ను శాశ్వతంగా వదిలించుకోవడానికి సహాయం చేయమని వారు అతనిని కోరారు. మరియు వాస్తవానికి, వారు అతనికి ప్రతిఫలంగా భారీ మొత్తంలో ధనం అందచేస్తామని వాగ్దానం చేశారు. దుష్ట క్షురకుడు(మంగలివాడు) డబ్బుకు ఆశపడి వెంటనే అంగీకరించాడు.
కొన్నిరోజుల తరువాత, రాజు తన ప్రత్యేక క్షురకుడిని పిలిపించాడు. ఆ క్షురకుడు రాజుగారి జుట్టుని కత్తిరిస్తూ తన పథకం ప్రకారం రాజుగారితో సంభాషణను ప్రారంభించాడు. రాజా మీ జుట్టు మన పక్క రాజ్యం యొక్క రాజుగారి జుట్టు కంటే చాలా ఒత్తుగా మరియు మృదువుగా ఉన్నది. నేను ఆ రాజు సేవకి ఎప్పుడు వెళ్లినా కూడా మీ జుట్టును కీర్తిస్తూ ఉంటాడు అన్నాడు. ఆ మాటలతో అక్బర్ చాలా మురిసిపోయాడు.
ఇదే అదనుగా భావించిన ఆ క్షురకుడు, అక్బర్ తో ఇలా అన్నాడు” రాజుగారు మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. అదేమిటంటే..! మన పక్క రాజ్యపు రాజుగారు మరణించి స్వర్గస్తుడైన తన తండ్రి క్షేమం గురించి చాలా పూజలు మరియు యజ్ఞాలు చేయిస్తున్నాడు. ఆ మాట విని అక్బర్ ఆశ్చర్యపోయాడు. అక్కడే ఉన్న క్షురకుడు తన తమ్ముడితో కూడా అవునని చెప్పించాడు.
అంతేకాదు రాజా! ఈ మద్యే ఒక మాంత్రికుడి సహాయంతో ఒక మంత్రిని స్వర్గంలో ఉన్న తన తండ్రి దగ్గరకు పంపించాడు. అతను తన తండ్రి యొక్క యోగ క్షేమాలు,అవసరాలు తెలుసుకుని వచ్చాడు అని చెప్పాడు. ఇదంతా అక్బర్ కి వినడానికి విడ్డూరంగా ఉన్న అక్కడ ఉన్నవారంతా అవును అని క్షురకుడి తరపున మాట్లాడేసరికి నమ్మక తప్పలేదు.
వెంటనే ఆ క్షురకుడు, ఇదంతా చేయడానికి చాలా తెలివి కలవాడు, ధైర్యవంతుడు కావాలి. మన రాజ్యంలో బీర్బల్ కన్నా తెలివి గల వారు ఎవరు లేరు. కావున, మీ తండ్రిగారి దగ్గరికి బీర్బల్ ని పంపించండి. అతను తండ్రిగారి యోగక్షేమాలు మరియు అవసరాలు తెలుసుకుని కొన్ని రోజుల్లో తిరిగి వచ్చేస్తాడు అన్నాడు.
బాగా ఆలోచించిన అక్బర్ , బీర్బల్ ని స్వర్గంలో ఉన్న తన తండ్రి దగ్గరికి పంపించాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే బీర్బల్ ని పిలిచి విషయాన్ని వివరించాడు. అదంతా తానంటే గిట్టనివారు వేసిన పథకం అని గుర్తించిన బీర్బల్, ఎలాగైనా వారికి బుద్ధి చెప్పాలి అని నిర్ణయించుకున్నాడు.
అక్బర్ తో, మహారాజా ! మీరు చెప్పినది చేయడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. కానీ, అన్ని రోజులు నేను కనబడకుండా ఉంటే.., నా కుటుంబీకులు భయపడతారు. కావున, నేను వారికి సర్ది చెప్పడానికి మరియు నన్ను నేను సిద్ధ పరుచుకోవడానికి, నాకు ఒక నెల సమయం కావలి అని అడిగాడు. అక్బర్ అందుకు సరే అని చెప్పి ,బీర్బల్ ని స్వర్గానికి పంపడానికి తగిన ఏర్పాట్లు చేయమని ఆ క్షురకుడికి చెప్పాడు.
అక్కడే ఉన్న బీర్బల్ శత్రువులు ఇక బీర్బల్ మీ చావు తప్పదని మనసులో నవ్వుకున్నారు.
నెల రోజుల గడువులో, బీర్బల్ తన చితిని కాల్చడానికి నిర్ణయించిన ప్రదేశం నుండి తన ఇంటికి ఒక సొరంగాన్ని తవ్వించాడు. మరియు తన చితిని దహనం చేస్తున్నపుడు ఎక్కువ పొగ వచ్చేలా ఏర్పాటు చేయించాడు.
బీర్బల్ ని స్వర్గానికి పంపే రోజు రానేవచ్చింది. బీర్బల్ అంటే గిట్టని మంత్రులందరూ మనసులో ఎంతో ఆనందపడుతున్నారు. ఇక ఇదే బీర్బల్ కి చివరి చూపు అని మురిసిపోతున్నారు. మాంత్రికుడు బీర్బల్ ని చితి పైన పడుకోబెట్టి ఏవో మంత్రాలు చదువుతున్నట్లు నటిస్తూ…చితికి నిప్పంటించాడు.
వెంటనే చితి నుండి చాలా ఎక్కువ పొగ వచ్చింది. బీర్బల్ సొరంగ మార్గం నుండి తప్పించుకున్నాడు. ఇక బీర్బల్ అంటే గిట్టని వారంతా బీర్బల్ చనిపోయాడని సంతోషపడ్డారు. కొన్ని రోజులు పోయాక, అక్బర్ మహారాజుకి ఏదో ఒకటి సర్ది చెప్పాలని నిర్ణయించుకున్నారు బీర్బల్ శత్రువులు.
కొన్ని నెలలు గడిచాయి. బీర్బల్ తన గడ్డము మరియు జుట్టును బాగా పెంచుకుని వికృతంగా తయారయ్యాడు. రాజు గారి తండ్రి దగ్గరి నుండి సమాచారాన్ని తీసుకువస్తున్నట్లుగా, బీర్బల్ రాజ భవనానికి చేరుకున్నాడు. అక్బర్, బీర్బల్ రాకతో సంతోషించాడు. బీర్బల్ ని చూసి ఆశ్చర్యపోవడం శత్రువుల వంతయింది.
అక్బర్, బీర్బల్ తన తండ్రి గారి యోగక్షేమాల గురించి అడిగాడు. బీర్బల్ తండ్రిగారు చాలా బాగున్నారని స్వర్గంలో అని సౌకర్యాలు కల్పించబడ్డాయని చెప్పాడు. అది విన్న అక్బర్ ఎంతో సంతోషించాడు. అంతలోనే.. బీర్బల్ కానీ, ఒకే ఒక లోటు ఉందని చెప్పాడు. అక్బర్ అదేమిటి? అని అడగగా.. బీర్బల్, స్వర్గంలో ఒక్క క్షురకుడు కూడా లేడని అందుకోసమే తానూ కూడా ఇలా గడ్డం, జుట్టు పెంచుకోవాల్సి వచ్చిందని, తండ్రిగారు మీతో ఒక క్షురకుడిని పంపవలసిందిగా కోరారని చెప్పాడు.
ఆ మాట విన్న అక్బర్ తప్పకుండా పంపిద్దాము. నా కోసం ప్రత్యేకంగా పనిచేసే క్షురకుడే అక్కవెళ్లాల్సింది అని ఆదేశించాడు. ఆ మాట విన్న క్షురకుడికి గుండె ఆగినంత పని అయింది. బీర్బల్ తనకు బుద్ధి చెప్పడానికే ఇలా ఇరికించాడని ఆ క్షురకుడికి అర్థమైంది. తానూ వేసిన ఉచ్చులో తానె పడ్డాడని అర్థమైంది. ఇదంతా బీర్బల్ ని చంపడానికి తామంతా కలిసి ఆడిన నాటకమని రాజుగారికి చెప్పలేకపోయాడు ఆ క్షురకుడు. అతనికి ఏంచేయాలో ఎలా తప్పించుకోవాలో అర్ధం కాలేదు.
కొన్ని రోజుల తర్వాత, ఆ క్షురకుడిని స్వర్గానికి పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. మాంత్రికుడు క్షురకుడి చితికి నిప్పు అంటించగానే మంటల్లో కాలి క్షురకుడు చనిపోయాడు.
అదంతా చూస్తున్న బీర్బల్ శత్రువులు.., తాము బ్రతికి పోయామని ఇంకెప్పుడు బీర్బల్ పైన కుట్ర చేయకూడదని చేస్తే పరిస్థితి ఇలా ఉంటుందని వారికి అర్ధమయ్యింది.
2 Comments