రామాపురం అనే గ్రామంలో గణేష్ అనే పేరుగల చిన్న వ్యాపారి ఉండేవాడు. గణేష్ తల్లితండ్రులు చిన్నప్పుడే మరణించిన కారణంగా గణేష్ తన చదువు కొనసాగించలేకపోయాడు. నాన్నగారి వ్యాపారం అయిన చిన్న కొట్టుని నడిపిస్తున్నాడు.
యుక్త వయస్సుకి వచ్చిన గణేష్ కి దగ్గరి బంధువులు కొంతమంది మంచి అమ్మాయిని చూసి పెళ్ళిచేసారు. గణేష్ కి వాళ్ళ తల్లి తండ్రులంటే చాలా ఇష్టం. అందుకారణంగా తన ఇల్లు మరియు ఊరు వదిలి ఎక్కడికి వెళ్లొద్దు, ఇక్కడే ఉంటె అమ్మ నాన్నల జ్ఞాపకాలతో బ్రతుకొచ్చు అనుకున్నాడు.
కానీ, తన సంపాదన అంతంత మాత్రన ఉన్నందున పట్నం వెళ్ళక తప్పలేదు. ఉన్న ఊరిని వదిలేసి భార్య భర్తలిద్దరూ పట్నం వెళ్లి, ఒక ఇల్లు రెంట్ తీస్కున్నారు. గణేష్ చాలా కష్టపడి ఒక కొట్టులో పని సంపాదించాడు.
కొద్ది రోజులయ్యాక గణేష్ భార్య రోజూ … భోజనం ముగ్గురు మనుషులకు వండటం మొదలు పెట్టింది. అది చూసి అడిగిన గణేష్ కి ఇలా చెప్పింది.” నాకు అత్తగారు కన్పిస్తున్నారండి మనతో కలిసి ఉండడానికి వచ్చారు. మీరంటే తనకి చాలా ఇష్టం ఇక ఇక్కడే ఉండిపోతాను అన్నారు అని చెప్పింది. అది విన్న గణేష్ మొదట ఆశ్చర్యానికి గురయ్యాడు. కానీ, తన తల్లి మీద ఉన్న ప్రేమతో నిజమే అని తాను కూడా భార్య మాటలు ఒప్పుకున్నాడు.
ఇలా రోజు అత్తగారికి కావాల్సిన మంచి వంటలన్నీ కనుక్కుంటూ మరీ వండిపెట్టేది. అది చూసి గణేష్ చాలా సంతోషించేవాడు.
కొన్ని రోజుల తర్వాత గణేష్ దూరపు మరియు చాలా కావాల్సిన బంధువు రాము ఒకరు పట్నానికి చిన్న పని మీద వచ్చాడు. గణేష్ తెలిసిన వాడు అవడంతో వాళ్ళ ఇంటి దగ్గర ఉండి పని పూర్తి చేసుకోవాలని అనుకున్నాడు. రాము, గణేష్ ఇంటికి వెళ్లేసరికి రాత్రి అయింది అప్పటికే వాళ్ళు భోజనం కోసం కూర్చున్నారు.
రాము రాకను చూసిన గణేష్ సంతోషంతో అన్నయ్య బాగున్నారా?! రండి కూర్చోండి భోజనానికి అని అన్నాడు. మూడు కంచాలలో భోజనం చూసిన రాము, గణేష్ ని అడిగాడు. నేను వస్తున్నానని మీకు ముందే తెలుసా? నాకోసం కూడా భోజనం సిద్ధం చేసారు అన్నాడు.
గణేష్, అది కాదు అన్నయ్య, మీ చెల్లెలికి అమ్మ కన్పిస్తుంది ఈ కంచం అమ్మ కోసమే అని చెప్పాడు. ఒక్కసారిగా ఆశ్చర్యపడి, కాసేపటికి తేరుకొని, మరి నేను అత్తగారి భోజనం తినేస్తే తనకెలా అని అడిగాడు? అది విన్న గణేష్ భార్య పర్లేదు అన్నయ్య నేను అత్తగారికి మళ్లి వంట చేస్తాను మీరు తినండి అంది.
అందరి భోజనం అయిపోయాక గణేష్ భార్య అత్తగారి కోసం మళ్లీ వంటను ప్రారంభించింది. గణేష్ సంతోషంతో, చూసారా! అన్నయ్య బ్రతికి ఉన్న అత్తని కూడా ఎవరు పట్టించుకోని ఈ రోజుల్లో ఎపుడో చనిపోయిన మా అమ్మని ఎంత బాగా చూసుకుంటుంది అన్నాడు.
ఇంకో రోజు రాత్రి కూడా అత్తగారి కోసం భోజనం కంచంలో వడ్డించి మూత పెట్టి వంట గదిలో పెట్టండి గణేష్ భార్య. రాముకి ఇదంతా నమ్మశక్యంగా లేదు. తెల్లవారు జామునే అందరి కంటే ముందు లేచి వంట గదిలోకి వెళ్లి అత్తగారి కంచాన్ని చూసాడు. భోజనం లేదు. అది చూసి రాము ఇంకా ఆశ్చర్యపోయాడు.
మరునాడు రాత్రి కూడా గణేష్ భార్య అత్తగారికి వంట గదిలో కంచం పెట్టింది. అర్ధరాత్రిలో రాముకి దాహం అవడంతో లేచి నీటి కోసం వంట గదిలోకి వెళ్ళాడు . అక్కడ గణేష్ భార్య అత్తగారికి పెట్టిన భోజనం తింటూ కనిపించింది, అది చూడనట్టుగా వచ్చి పడుకున్నాడు.
మరునాడు గణేష్, అన్నయ్య ఒక 500 రూపాయలు ఇవ్వు . అమ్మ చీర కొనమని నా భార్యకి చెప్పిందట! సమయానికి నా దగ్గర డబ్బు లేదు అన్నయ్య. నువ్వు మళ్లీ పట్నానికి వచ్చినపుడు ఇచ్చేస్తా అని తీసుకున్నాడు.
డబ్బు తీస్కొని భార్య భర్తలిద్దరూ కలిసి బజారుకి వెళ్లి మంచి చీర తీసుకున్నారు. రాత్రి భోజనాలయ్యాక గణేష్ భార్య, రాముతో ఇలా అంది.” అన్నయ్య, అత్తయ్య మిమ్మల్ని రేపే ఇంటికి వెళ్ళిపోమని చెప్పింది. తప్పుగా అనుకోవద్దని చెప్పింది. వదిన (రాము భార్య) తనకి కూతురి వరస కదా! మీరు లేకుండ వదిన ఇంట్లో ఇబ్బంది పడతారని తనలా ఆలోచించి చెప్పింది అంది.
అది విన్న రాము మనసులో నవ్వుకొని పర్లేదమ్మ నా పని రేపటితో అయిపోతుంది. ఖచ్చితంగా ఆ మరునాడు ప్రొద్దున వరకు వెళ్ళిపోతాను అని చెప్పాడు. మరుసటి రోజు రాత్రి అందరు భోజనానికి కూర్చున్నారు. ఎప్పటిలాగే గణేష్ భార్య అత్తగారికి ఒక కంచం పెట్టి అన్ని వడ్డించి పెట్టింది.
రాము, గణేష్ భార్యకి ఇంకో కంచం తీసుకురమ్మని చెప్పాడు. గణేష్, ఎందుకన్నయ్య? అని అడిగాడు. మీ నాన్నగారు వచ్చారు. మీ అమ్మని ఇక తీసుకెళ్తారట నీతో చెప్పమన్నాడు. భోజనం అయ్యాక ఇద్దరు కలిసి వెళ్ళిపోతారట అని చెప్పాడు.
అది విని ఖంగుతిన్న గణేష్ భార్యకి ప్రాణం పోయినంత పని అయింది . అపుడు గణేష్, నాన్నగారికి ఎపుడు తొందరే అమ్మ నా దగ్గర ఉంటే ఏమవుతుంది ? ఇపుడు తాను తీసుకెళ్లడం అవసరమా!? అని అన్నాడు..
ఆ మరుసటి రోజు రాము వెళ్ళిపోయాక తన గదిలోకి అన్ని వస్తువులు సరిచేయడానికి వెళ్ళింది గణేష్ భార్య. అక్కడ ఒక ఉత్తరం ఉంది. అది చదివింది గణేష్ భార్య అందులో ” చెల్లెమ్మ నువ్వు నాకు తోడబుట్టకున్న నాకు చెల్లెలివే నీ తిండి పుష్టి మరియు బట్టల మీద అత్యాశతో లేని అత్తని ఉంది అని చెప్తున్నావు. నువ్వు ఎందుకు అలా చెప్తున్నావో నాకంత తెలుసు. గణేష్ చాలా మంచివాడు అత్యాశకు పోయి గణేష్ వల్ల కానీ వస్తువులని కూడా అప్పుచేసి మరీ కొనిపిస్తున్నావు. బంధువులని కూడా దూరం చేస్తున్నావు . నువ్వు చేసేది చాలా పెద్ద తప్పు ఇప్పటికైనా నువ్వు మారి గణేష్ ని బాగా చుసుకో అని చెప్పాడు.
అది చూసి గణేష్ భార్య తనెంత పెద్ద తప్పు చేస్తుందో తెలుసుకుని, మనసులో అన్నయ్యకి కృతఙయతలు చెప్పుకుంది.
చాలా మంచి కథలు , ఇలాగే వ్రాసిన కథలు అందరు చదివి ఆనందించాలని కోరుతు
ముందు ముందుగా ఇంకెన్నో ఆసక్తికరమైన విశయాలపై
చదివే అవకాశం అందరికి దొరుకుతుంది.
👌👍 మరీ ఫేండ్స రచయిత దివ్య నిఖిల్ పారిపెల్లి ల ✍️
తోడుగా ఉండండి.
ధన్యవాదములు!! తప్పకండా మరెన్నో ఆసక్తికరమైన విషయాలను కథలుగా మార్చి మీ ముందుకు తీసుకొస్తాను.