మూడు ప్రశ్నలు | The Three Questions

మూడు ప్రశ్నలు | The Three Questions
మూడు ప్రశ్నలు | The Three Questions

అక్బర్ రాజుకు బీర్బల్ మంత్రి అంటే చాలా ఇష్టం. అక్బర్ ఆ ఇష్టాన్ని ఎప్పుడు బాహిర్గతం చేసేవాడు. ప్రతి విషయంలో అక్బర్ బీర్బల్ ని చాలా  ప్రశంశించేవాడు. ప్రతీరోజు ఇదంతా చూస్తున్న అక్బర్ సభలోని ఒక మంత్రికి బీర్బల్ పైన చాలా అసూయ కలిగేది. 

ఆ మంత్రికి కలిగే అసూయ గురించి  తెలిసిన అక్బర్, బీర్బల్ ని ఎందుకు తాను అంతగా ప్రశంశిస్తాడో, బీర్బల్ యొక్క తీర్పుకి ఎందుకు అంత విలువ ఇస్తాడో.., ఇలాంటి అసూయ కలిగే అందరి మంత్రులకి  తెలియచెప్పాలి అనుకున్నాడు.

ఒకరోజు సభలో అందరు మంత్రులు హాజరయ్యారు. ఇదే సరైన సమయం అని భావించిన అక్బర్, బీర్బల్ ని కూడా సభకి పిలిపించాడు.

బీర్బల్ నువ్వు చాలా తెలివైన వాడివని నేను నమ్ముతున్నాను. కానీ, ఈ సభలో చాలా మంది మంత్రులు నీ పట్ల అసహనాన్ని కలిగి ఉన్నారు నేను ఈ రోజు వారికి గుణపాఠం చెప్పాలి అనుకుంటున్నాను.

అందుకోసం నేను కేవలం మూడు ప్రశ్నలు వేస్తాను. సభలో ఎవ్వరైనా దానికి సమాధానం తెలిస్తే ముందుకు  వచ్చి  మీ సమాధానాన్ని అందరి ముందు చెప్పగలరు. సభికులందరికి మీ సమాధానం నచ్చి మరియు మీ సమాధానంతో ఏకీభవిస్తే మీకు నేను బీర్బల్ యొక్క పదవిని, స్థానాన్ని కల్పిస్తాను అని చెప్పాడు.

అందుకు సభలోని మంత్రులు  అందరు మనసులో…., బీర్బల్ తెలివి ముందు  ఎలాగూ ఓటమి తప్పదని తెలిసినా …. అక్బర్ ప్రశ్నలు అడగకముందే ఓటమిని ఒప్పుకుంటే సభలో వారికి విలువ ఉండదని భావించి, బయటకి వారు  తాము సమాధానం చెప్పడానికి  సిద్ధంగా ఉన్నామని చెప్పారు. 

అక్బర్ అడిగిన మూడు  ప్రశ్నలు :

1. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి ?

2. భూమి యొక్క మధ్య భాగం ఎక్కడ ఉంది ?

3. మన రాజ్యంలో  ఎంత మంది పురుషులు మరియు ఎంత మంది మహిళలు ఉన్నారు ?

వెంటనే అక్బర్ బీర్బల్ ని, నేను అడిగిన మూడు ప్రశ్నలకు నువ్వు కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ  మూడు ప్రశ్నలకు  సమాధానం చెప్పలేకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుందని తెలియజేశాడు. బీర్బల్ అందుకు సరే అన్నాడు.  బీర్బల్ కాకుండా సభలో ఉన్న ఏ మంత్రి అయినా  సరైన  సమాధానం చెప్తే వారే ఇక నుండి బీర్బల్ యొక్క స్థానాన్ని పొందుతారు అని చెప్పాడు అక్బర్. 

అక్బర్ అందరి మంత్రులని ప్రశ్నించాడు. ఎవరికైనా సమాధానం తెలిస్తే ముందుకు వచ్చి చెప్పొచ్చు అని.  కానీ.., అక్బర్ రాజు అడిగిన ప్రశ్నలు సామాన్యమైనవి కాదు. వాటికి అంత సులువుగా సమాధానం చెప్పలేమని అనుకుని. సభలోని ఏ ఒక్క మంత్రి కూడా సమాధానం చెప్పడానికి ముందుకు రాలేరు.

కాస్త సమయం గడిచాక బీర్బల్ ముందుకు వచ్చి నేను ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పగలను అన్నాడు. అది విన్న సభికులందరు ఆశ్చర్యపోయారు. బీర్బల్ సమాధానం కోసం మంత్రులందరూ ఎదురుచూస్తున్నారు.

మొదటి ప్రశ్నకు సమాధానంగా, బీర్బల్ బాగా వెంట్రుకలతో కూడిన ఒక గొర్రెను తీసుకువచ్చి, “ఈ గొర్రెకి ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో ఆకాశంలో అన్ని  నక్షత్రాలు ఉన్నాయి. మీకు ఎవరికైనా సందేహంగా ఉంటె మీరు వచ్చి ఈ గొర్రెకి ఉన్న వెంట్రుకలని లెక్కపెట్టండి అన్నాడు.

రెండవ ప్రశ్నకు సమాధానమివ్వడానికి, బీర్బల్ నేలపై రెండు గీతలు గీసి, వాటి మధ్యలో ఒక ఇనుప కడ్డీని ఉంచి, “ఇది భూమి మధ్యలో ఉంది, మీకు ఎవరికైనా సందేహంగా ఉంటె మీరు వచ్చి స్వయంగా కొలవగలరు.

మూడవ ప్రశ్నకు సమాధానంగా, బీర్బల్ ఇలా అన్నాడు, “మన రాజ్యంలోని ప్రజలు కొంతమంది పక్కరాజ్యంలోకి మరియు పక్కరాజ్యంలోని ప్రజలు మన రాజ్యానికి వచ్చారు. కావున, ఎప్పుడైతే వారు ఎవరి రాజ్యానికి వారు వెళ్తారో… మరియు అలా ఒకరి రాజ్యానికి మరొకడం ప్రయాణించడం ఆగిపోతుందో…  అపుడు నేను సమాధానం చెప్తాను అన్నాడు బీర్బల్.

నిజానికి అది ఎప్పటికి జరగని పని.  ఎందుకంటే? ఒక రాజ్యం నుండి మరొక రాజ్యానికి ప్రజలు ప్రయాణించడం సహజంగా జరిగే పని.  అంటే బీర్బల్ ఆ ప్రశ్నకి  శాశ్వత సమాధానం లేదని తెలివిగా సమాధానం చెప్పాడు.

బీర్బల్  సమాధానాలు విన్న సభికులందరు ఆశ్చర్యపోయారు మరియు అక్బర్ లోలోపల గర్వంతో  అనుభూతి చెందాడు. కావున బీర్బల్ స్థానం మరియు పదవి మారలేదు. ఎల్లప్పుడు

అసూయ చెందే మంత్రులు తమ తప్పు తెలుసుకుని, తెలివి తేటలలో  తమ స్థాయి ఏంటో అర్ధం చేసుకున్నారు. బీర్బల్ పైన అసూయ చెందడం మానుకున్నారు.

నీతి | Moral : ప్రతి ప్రశ్నకు ఒక సమాధానం తప్పకుండా  ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *