మనిషి విలువ | Value of A Person
మనిషి విలువ | Value of A Person

‘అను’  ఒక చిన్న గ్రామానికి  చెందిన ఒక సాధారణ ఇంటి అమ్మాయి.  తాను డిగ్రీ వరకు చదివి ఇక పై చదువులు చదివే స్థోమత లేక పట్టణానికి వెళ్లి జాబ్ చేసే అనుభవం లేక ఇంట్లోనే ఉంటూ పనులు చూసుకొంటోంది.

‘అజయ్’  అదే గ్రామానికి చెందిన  విజయవంతమైన కెరీర్ ఉన్న ఒక సాధారణ వ్యక్తి. అజయ్ ఉన్నతంగా  స్థిరపడిన కారణంగా ఊర్లో ఉన్న చాలా మంది అమ్మాయిలు అతన్ని ఇష్టపడేవారు. అజయ్ అవేమి పట్టించుకునేవాడు  కాదు..  అనుకి కూడా అజయ్ అంటే చాలా ఇష్టం ఉండేది. ఒకరోజు అను తన మనసులో మాటని అజయ్ కి చెప్పింది. అను చాలా అందమైన అమ్మాయి, పైగా తన యొక్క అమాయకత్వంతో అందరిని ఇట్టే  కట్టిపడేస్తుంది.

అజయ్ కి కూడా అను నచ్చడంతో… అను ప్రేమని అంగీకరిస్తాడు. అను, అజయ్ పైన చూపించే ప్రేమ మరియు అజయ్, అనుపై చూపించే అభిమానం వెలకట్టలేనిదిలా ఉండేది. అను డిగ్రీ వరకు చదువుకున్నది  కాబట్టి పెళ్లికి ముందే అనుని  మంచి స్థాయిలో ఉండేలా చేయాలి అని అజయ్ ఆలోచించాడు.

ఎందుకంటే “రేపటి రోజు నేను ఉన్న లేకున్నా  తన కాళ్ల పై తాను నిలబడి ఉన్నత స్థాయిలో ఉండాలి అనేది అతని కోరిక..”

ఆరోజు నుండి అనుకి వెన్నంటే  ఉండి  తన ప్రతీ అడుగులో తోడున్నాడు. తన పై చదువులకి సహకరించాడు . తాను చేయాలనుకున్న బిజినెస్ సలహాకు సరే అన్నాడు. తగిన పెట్టుబడి పెట్టి ఆమెని ముందుకు నడిపించాడు. తాను వేసే ప్రతి అడుగుని పది రకాలుగా ఆలోచించి ఏది తప్పో, ఏది సరియైనదో  అన్నీ సలహాలు ఇచ్చేవాడు. ఎందుకంటే అజయ్ వాటన్నిటినీ దాటుకుని వచ్చినవాడు. తనకు కాబోయే భార్య అలాంటి ఇబ్బంది ఎపుడు పడొద్దని చాలా జాగ్రత్త పడేవాడు.

కొన్ని రోజులలోనే అను ఉన్నత స్థాయికి చేరుకుంది. అజయ్, ఆమె ప్రతి అడుగులో తోడుంటూ ఆమెని ఉద్యోగంలో  ఒక్కో మెట్టు ఎక్కేలా  చేస్తూ వస్తున్నాడు.ఎప్పుడైనా అను సరి అయిన నిర్ణయం తీసుకోకపోతే, అజయ్ కొంచెం కఠినంగా వ్యవహరించి తనను  సరైన  మార్గంలో నడిపించేవాడు.   అను , తన మార్గంలో ఆమె ఎంతో మందిని చూసింది.  చాలా మంది ఆమె అందాన్ని, తెలివిని చూసి ఆమెని పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు.

కొన్ని రోజుల తర్వాత… అను బిజినెస్ లో తానే స్వయంగా ఆలోచించి నిర్ణయాలు తోసుకొనే  స్థాయికి ఎదిగింది. ఇక అజయ్ ఎలాంటి సలహా ఇచ్చినా..  తీసుకునే పరిస్థితిలో ఆమె లేదు. అజయ్ ఇచ్చే సలహాలను ఆమె పాటించడం మానేసింది. అజయ్ ,అనుకి  అలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని నచ్చచెప్పే ప్రయత్నం చేసినా..  అజయ్ ని తిట్టేది. నీ సలహా నాకేం అక్కర్లేదు..  నేను స్వంతగా ఆలోచించుకోగలను..  నీ బోడి సలహాలను ఇంకెవరికైనా చెప్పు నాకు కాదు. అయినా అసలు నువ్వు నా  నుండి  దూరంగా వెళ్లిపో అపుడే నేను సంతోషంగా ఉంటాను అని అంది.

ఆ మాటలకు అజయ్ మనసు విరిగిపోయింది . అజయ్  చాలా బాధపడ్డాడు. అజయ్, అను తో.. “నేను నిన్ను ఒక సాధారణ అమ్మాయిగానే ఇష్టపడ్డాను. కానీ, నాకు నిన్నొక ఉన్నత స్థానంలో చూడాలనే కోరికతో.. నువ్వు నువ్వులా  బ్రతకాలని చేయాలనుకున్నాను. మొదట్లో  నేనిచ్చే సలహాలు అన్ని తీసుకున్నావు.  మంచి ఉన్నత స్థాయిలోకి వచ్చావు.  నేనెప్పుడైనా కఠినంగా వ్యవహరించినా అది నీ మంచి కోసమే.. కానీ.., ఇపుడు నీకు నా మాటలే నీకు చేదయ్యాయి. నేను ప్రేమించిన అను ఇది కాదు. ఇక నేను నీ జీవితంలోకి నేను రాను అని చెప్పి వెళ్లిపోయాడు”.

అను, అజయ్ మాటలని పట్టించుకోలేదు. నువ్వు కాకపోతే నాకు ఇక్కడ చాలా మంది ఉన్నారు. అని అనుకుని మనస్సులో నవ్వుకుంది. .

కొన్ని రోజులకి..  అను తన ఆస్తి మొత్తం పెట్టుబడిగా పెట్టి మరో కొత్త  బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంది. తన స్వంత ఆలోచలనతోనే అన్నీ పనులు చేకుంటూ  వచ్చింది. సడన్ గా ఒకరోజు గవర్నమెంట్ నుండి ఉత్తర్వులు రావడం త్వరగా ఆ బిజినెస్ ని క్లోజ్ చేయాలనీ చెప్పడం జరిగింది. అది విన్న అను ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.

ఎంత మందిని సహాయం కోరినా..  ఎవరు తనకు అండగా నిలబడలేరు. ఒకపుడు తన తెలివిని మెచ్చి పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్లు  కూడా మాకేం తెలియదు అన్నట్టు వెళ్లిపోయారు. ఆ క్షణం…  ఆమె మదిలో మెదిలిన వ్యక్తి అజయ్. అసలు అజయ్ నాపక్కన ఉంది ఉంటె నాకీ పరిస్థితి వచ్చేది కాదు.

ప్రతీ పనిలో మంచేదో, చెడోదో  చెప్తూ ఇంతవరకు నన్ను తప్పటడుగు వేయకుండా చేసాడు. అతను నన్నెపుడు ఉన్నత స్థాయిలో, సంతోషంగా ఉండాలనే చూడాలనుకున్నాడు. నేనే నా  అతి మూర్ఖత్వంతో అజయ్ ని దూరం చేసుకున్నాను అని బాధపడింది. వెంటనే వెళ్లి అజయ్ ని కలవాలనుకుంది.తన తప్పుని మన్నించమని మరియు  తనని పెళ్లిచేసుకోవాలనుకుంది అని చెప్పాలనుకుంది. . 

కానీ, అప్పటికే అజయ్ తనంటే ప్రాణమిచ్చే ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని స్థిరపడ్డాడు. ఇది తెలిసిన అను  చేసేది ఏమిలేకా తన జీవితంలో అతి విలువైన వ్యక్తిని కోల్పోయానని   అర్ధం చేసుకొని  బాధాతప్త హృదయంతో వెనుతిరిగింది.

నీతి | Moral : “మీ కోసం శ్రద్ధ వహించే వారు మాత్రమే మీకు మార్గనిర్దేశం చేయడం ద్వారా లేదా అప్పుడప్పుడు కఠినంగా ఉండటం ద్వారా మీకు సరైన మార్గాన్ని చూపించడానికి ప్రయత్నిస్తారు – వారు మిమ్మల్ని ఎప్పుడూ..  ఉన్నత స్థాయిలో ఉండాలని  కోరుకుంటారు.  కాబట్టి, మీ గతం మరియు మీ జీవితంలో భాగమైన  వ్యక్తి గురించి ఒక్క నిమిషం ఆలోచించండి.  అలాంటి వ్యక్తి మీ జీవితంలో ఉండకపోతే ఈ రోజు మీరు ఎక్కడ ఉండేవారు? అహం మరియు కోపాన్ని వదిలేయండి .  ఎందుకంటే చివరికి మన జీవితంలో అత్యంత విలువైన భాగం ఆ వ్యక్తే  కావచ్చు.”

2 Comments

  1. Good Stories.
    Iam following this stories blogs since 2 years, whenever I feel tired this stories makes me so relax.
    Thanks for making this old tradition for the good cause.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *